మాజీ మంత్రి పొంగూరు నారాయణ సంస్థల్లో ఉద్యోగులు, ఆయన బంధువుల ఆస్తులను ఏపీ సీఐడీ జప్తు చేసింది. ఆయన బంధువులు, సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, మరికొందరు దగ్గరి వ్యక్తుల పేరుతో ఉన్న 21 స్థిరాస్తులను అటాచ్ చేసింది. ఇంకొందరి బ్యాంకు అకౌంట్లు సైతం సీజ్ చేసింది. అమరావతి ప్రాంతంలో నారాయణ భూములు కొనుగోలు చేసినట్లు సీఐడీ కేసు నమోదు చేసింది. దీనిపై దర్యాప్తు చేసిన అధికారులు.. అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్‌లో తన బినామీ భూములకు విలువ పెరిగేలా ప్లాన్ రూపొందించుకున్నట్లు ఆరోపించింది. ఈ క్రమంలో అమరావతిలోని ఉద్దండరాయునిపాలెం, రాయపూడి, లింగాయపాలెం, మందడం, కొండమరాజుపాలెం గ్రామాల్లోని ఆస్తులను అటాచ్ చేసింది. 2015 జూన్- ఆగస్టు మధ్య 58.50 ఎకరాల వ్యవసాయ భూమిని రూ.3.66 కోట్లకు కొనుగోలు చేసినట్లు సీఐడీ పేర్కొంది. దీనికి సంబంధించి 75,880 చదరపు అడుగుల భూమిని అటాచ్ చేసినట్లు తెలిపింది. రామకృష్ణా హౌసింగ్ ప్రైవేటు లిమిటెడ్ ఎండీ అంజనీకుమార్‌కు చెందిన రెండెకరాలను కూడా సీఐడీ అటాచ్ చేసింది. నారాయణ సంస్థల ఉద్యోగి పొత్తూరి ప్రమీల, రాపూరు సాంబశివరావు, ఆవుల ముని శంకర్, వరుణ్ కుమార్‌కు చెందిన 4 బ్యాంకు అకౌంట్లను సీఐడీ సీజ్ చేసింది. వీళ్లందరూ నారాయణ బినామీలని సీఐడీ పేర్కొంది.