డెంగ్యు జ్వరంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవగాహన అవసరమని ఈ జ్వరం ప్రమాదకరమని, ప్రభుత్వ వైద్య శాలల్లో చికిత్స సదుపాయాలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణా రెడ్డి అన్నారు. మంగళవారం మే 16 న ప్రపంచ డెంగ్యు దినోత్సవం సందర్భంగా స్థానిక డి. ఎం. హెచ్. ఓ కార్యాలయం నుండి రుయా ఆసుపత్రి వరకు నిర్వహించిన అవగాహనా ర్యాలీని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మంచి నీటిలో మాత్రమే ఈ టైగర్ దోమలు వృద్ధి చెందుతాయని ఇంటి పరిశరాలలో మంచి నీరు నిల్వ లేకుండా చూడాలని అన్నారు. ఈ దోమ బరువుతో కూడుకుని చారలు కలిగియుండి మనుషుల మోకాళ్ళ క్రింది బాగంలో కుట్టడం వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుందని అన్నారు. అందుకే ఇంటిలో మంచి నీరు నిల్వ లేకుండా ప్రతి శుక్రవారం డ్రై డే గా పాటించి కొత్తగా నీటిని పాత్రలలో నింపుకోవాలని అన్నారు. ఈ డెంగ్యు వైరస్ దోమ కాటు తరువాత 3 నుండి 14 రోజులలో వ్యాధి సోకవచ్చని అన్నారు. అందుకే ఇంటి వద్ద టైర్లలో, చిన్నపాటి గుంటలలో వర్షపు నీరు కూడా నిల్వ లేకుండా చూడాలని అన్నారు. డెంగ్యు వ్యాధి సోకిన వారు ప్రైవేటు ఆసుపత్రులకన్నా ప్రభుత్వ ఆసుపత్రులలో చికిత్స పొందాలని అన్ని రకాల పరీక్షలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. డెంగ్యు వ్యాధి మూడు రకాలుగా ఉంటుందని అందులో హేమరేజ్, షాక్ సిండ్రోం రకాలు ప్రమాదకరమైనవని ప్లేట్ లెట్స్ ఎక్కించవలసిన అవసరం వస్తుందని అన్నారు. అందుకే మనం దోమల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం వైద్యులతో, వారి సిబ్బందితో పరిశరాల పరిశుభ్రత భాద్యతగా చూస్తామని ప్రతిజ్ఞ చేయించారు.