నాలుగేళ్లుగా అధికారంలో ఉన్నా వైసీపీ కార్యకర్తలకు అన్యాయం జరిగిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇబ్బందిపడుతున్న వారికి అన్ని విధాలా న్యాయం చేయాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సోమవారం ఒంగోలులోని పీర్లమాన్యంలో నూతనంగా నిర్మించిన అర్బన్ హెల్త్ సెంటర్‌ను బాలినేని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ కార్యకర్తలు లేనిదే పార్టీ లేదన్నారు. వారి ఇబ్బందులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలన్నారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి బటన్ నొక్కి జనానికి లబ్ధి చేకూర్చుతున్నారే తప్ప తమకు న్యాయం చేయలేదనే భావనలో కార్యకర్తలు ఉన్నారన్నారు. తప్పకుండా వారికి అండగా ఉంటానని బాలినేని హామీ ఇచ్చారు. ఈ మధ్య అయిన వాళ్లే నాపై కుట్ర చేస్తుండటంతో కాస్త బాధపడ్డానని, ఇక ఎవరినైనా ఎదిరిస్తానని తెలిపారు. మా నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కరేనని ఇంకెవరినీ లెక్కచేసేది లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఒంగోలు నుంచే పోటీ చేస్తాననని బాలినేని స్పష్టం చేశారు. తాను దర్శి, గిద్దలూరు నుంచి బరిలోకి దిగుతానని వస్తున్న ప్రచారాలపై స్పందించారు. రాజకీయ ప్రస్థానం ఒంగోలు నుంచే ప్రారంభించానని, వచ్చే ఎన్నికల్లో ఒంగోలు నుంచే పోటీ చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యే సుధాకర్‌బాబు, కలెక్టర్ దినేష్‌కు మార్, ఇన్‌చార్జి మేయర్ వేమూరి సూర్యనారాయణ, ఓడా చైర్మన్ సింగరాజు మీనాకుమారి, కార్పొరేటర్ గోలి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.