అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. పేదలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇస్తుంటే దాన్ని అడ్డుకోవడం కరెక్ట్ కాదు.. రాజ్యాంగ స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నామని సుప్రీం కోర్టు కూడా తీర్పు చెప్పడం చరిత్రలో సువర్ణాధ్యాయమని అన్నారు. పెత్తందార్లతో యుద్ధం చేసి పేదలను గెలిపించిన లీడర్ సీఎం వైయస్ జగన్ అని అన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ పేదల పక్షాన బలమైన నాయకుడిగా నిలబడ్డారని చెప్పడానికి సుప్రీం కోర్టు తీర్పు నిదర్శనమన్నారు. అమరావతిలో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే ఎందుకంత బాధ అని పెత్తందార్లను ప్రశ్నించారు. రాష్ట్రంలో పేదలకు, పెత్తందార్లకు మధ్య యుద్ధం జరుగుతుందని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ చెప్పారు.