రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో గురువారం ఎండ తీవ్రత కొనసాగింది. ముఖ్యంగా రాయలసీమలోని కడప, నంద్యాల జిల్లాల్లో తీవ్ర వడగాడ్పులు వీచాయి. కడప జిల్లా సింహాద్రిపురంలో 44.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మధ్య భారతం నుంచి తెలంగాణ వరకు ద్రోణి కొనసాగుతోంది. ఇంకా ఎండతీవ్రత, సముద్రం నుంచి వీచే గాలుల ప్రభావానికి వాతావరణ అనిశ్చితి నెలకొని గురువారం పలుచోట్ల ఈదురుగాలులు, పిడుగులతో వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, రానున్న రెండు రోజులు వడగాడ్పులు కాస్త తగ్గుముఖం పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. శుక్రవారం అనకాపల్లి, గుంటూరు, కాకినాడ, పల్నాడు, ఎన్టీఆర్, మన్యం, విజయనగరం, కడప జిల్లాలోని 29 మండలాలు, శనివారం 33 మండలాల్లో మోస్తరు వేడిగాలులు వీస్తాయని తెలిపింది. శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో 44-45 డిగ్రీలు.. విశాఖ, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, అనంతపురం, నంద్యాల, చిత్తూరు, తిరుపతి, కడప, అన్నమయ్య, కడప జిల్లాల్లో 42-43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.