సీఎం జగన్ ఈ నెల 24వ తేదీన కొవ్వూరులో పర్యటించనున్నారని హోం మంత్రి తానేటి వనిత తెలిపారు. రాజమహేంద్రవరం జిల్లా కలెక్టరేట్‌లో గురువారం సాయంత్రం సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్షించారు. కొవ్వూరులో విద్యా దీవెన సొమ్ములు బటన్ నొక్కి విడుదల చేస్తారని తెలిపారు. అధికారులు ముందస్తు కార్యాచరణ ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. సీఎం కార్యక్రమాల సమన్వయకర్త, ఎమ్మెల్సీ తలశిల రఘురాం మాట్లాడుతూ కొవ్వూరు పట్టణంలో సీఎం సభకు అవసరమైన సభావేదిక, హెలిప్యాడ్, వాహనాల పార్కింగ్ స్థలాలు పరిశీలించామన్నారు. ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ సీఎం జగన్ ఇప్పటి వరకూ జిల్లాలో ఐదుసార్లు పర్యటించారన్నారు. ఈ మేరకు అధికారులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. అనంతరం సీఎం పర్యటనకు సంబంధించి కొవ్వూరు పట్టణంలో సభావేదిక, హెలిప్యాడ్‌కు స్థలాలను పరిశీలించారు. అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ డా.కె.మాధవీలత ఆదేశించారు. హెలిప్యాడ్ నుంచి సభా వేదిక వరకూ రోడ్ షో కు సంబంధించిన ఏర్పాట్ల బాధ్యతను రాజమహేంద్రవరం మునిసిపల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌కు అప్పగించారు.ఈ కార్యక్రమంలో ఎస్పీ సుధీర్‌కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, జేసీ ఎన్.తేజ్‌భరత్, డీఆర్వో జి.నరసింహులు,ఆర్డీవోలు ఎ.చైత్రవర్షిని, ఎస్.మల్లిబాబు, డీఎంహెచ్‌వో కె.వేంకటేశ్వర్లు, డీసీహెచ్‌ఎస్ డా. సనత్‌కుమారి, డీపీవో పి.జగదాంబ, డీఆర్‌డీఏ పీడీ సుభాషిణి పాల్గొన్నారు.