నెల్లూరు జిల్లా, ఉదయగిరి నియోజకవర్గ పరిధిలోని దుత్తలూరు-సీతారామపురం మార్గంలో 36.40 కిలోమీటర్ల మేర నిర్మించే 167-బీజీ జాతీయ రహదారి నిర్మాణంలో భూములు, భవనాలు కోల్పోయే బాధితులకు పరిహారం చెల్లిస్తామని హైవే డీఈ అనిల్‌కుమార్ పేర్కొన్నారు. గురువారం తహసీల్దారు సానా శ్రీనివాసులురెడ్డితో కలిసి పట్టణంలోని కావలి మార్గంలో జాతీయ రహదారి నిర్మాణ అలైన్‌మెంట్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తయిందన్నారు. త్వరలో పనులు ప్రారంభించడం జరుగుతుందన్నారు. రహదారి నిర్మాణంలో విద్యుత్ డీఈ కార్యాలయం, సివిల్ సప్లయీస్ గోదాముల భవనాలు తొలగించాల్సి ఉంటుందన్నారు. ఆయా భవనాలకు ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుందన్నారు. అలాగే రైతులకు సంబంధించి భూములు, వృక్షాలకు సైతం ప్రభుత్వ నిబంధనల మేరకు పరిహారం చెల్లించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో సర్వేయర్లు రవి, మీరావలి, సిబ్బంది పాల్గొన్నారు.