దైవ దర్శనం కోసం ఓ కుటుంబం ప్రయాణిస్తున్న కారు, ఎదురుగా దైవ కార్యంలో పాల్గొనడానికి వెళుతున్న మరో కుటుంబానికి చెందిన ఆటోను ఢీకొన్న ఘటన పీలేరు మండలంలో చోటు చేసుకుంది. పీలేరు - రాయచోటి జాతీయ రహదారిపై శనివారం జరిగిన ఘటనా వివరాలు పోలీసుల కథనం మేరకు ఇలా ఉన్నాయి. తాడిపత్రి నుంచి ఓ కుటుంబం కాణిపాక వరసిద్ధి వినాయకుని దర్శనం కోసం కారులో బయలుదేరి వచ్చింది. ఆ కారు పీలేరు మండలం, ముడుపులవేముల పంచాయితీ, కృష్ణారెడ్డిగారిపల్లి బస్ స్టాపుకు కొద్ది దూరంలో ఎదురుగా తిరుపతి నుంచి వస్తున్న ఆటోను ఢీకొంది.
ఈ ఘటనలో ఆటోలో వస్తున్న అన్నమయ్య జిల్లా, కలకడ మండలం, కోటగుడిబండకు చెందిన గండికోట రామలక్ష్మి(53), ఆమె కుమారుడైన ఆంజనేయులు (34), కోడలు జ్యోతి (27), మనుమరాళ్లు యువచైత్ర (8), గుణసాత్విక (6), కోన గ్రామానికి చెందిన శివకృష్ణ కుమార్తె జ్ఞానశ్రీ (9) తమ స్వగ్రామంలోని బంధువుల ఇంట్లో జరుగుతున్న దైవ కార్యంలో పాల్గొనడానికి వస్తూ ప్రమాదానికి గురయ్యారు. ఈ దుర్ఘటనలో యువ చైత్ర (8) మృతి చెందగా మిగిలిన కుటుంబ సభ్యులు తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పీలేరు పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను, మృతదేహాన్ని పీలేరు ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. బాధితులను ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం తిరుపతికి పంపారు. మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. ఈ మేరకు పీలేరు ఎస్ఐ నరసింహుడు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు.