దేశవ్యాప్తంగా ఉన్న ప్రజా సమస్యల పరిష్కారానికి సోషలిజమే మార్గమని మాజీ శాసనమండలి సభ్యులు ఎంవిఎస్ శర్మ అన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య 38వ వర్ధంతి సందర్భంగా స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో ఉక్కునగరం యూనియన్ కార్యాలయంలో మూడు దశాబ్దాల నూతన ఆర్థిక, పారిశ్రామిక విధానాలు- ప్రభుత్వ రంగం- కార్మికులు- ప్రజలపై ప్రభావం అనే అంశంపై సదస్సు శనివారం నిర్వహించారు. దీనికి ముఖ్య వక్తగా ఎం వి ఎస్ శర్మ పాల్గొని మాట్లాడుతూ పెట్టుబడిదారీ సమాజం సమస్యలను సృష్టిస్తోందని వాటి మధ్యలో జీవనం గడుపుతూ, పరిష్కరిస్తామన్న భ్రమలను కల్పిస్తున్న రాజకీయాలను నమ్మడమే ప్రజల అమాయకత్వమని ఆయన వివరించారు. ఇదే సమయంలో సోషలిస్టు దేశాలలో సమస్యలు పరిష్కారం అవడం జరుగుతోందని ఆయన అన్నారు. ఉదాహరణకు చైనాలో ఆకలి రూపుమాపకలిగారని కానీ మనదేశంలో దానికి విరుద్ధంగా ఆకలి చావులు అనేకమని ఆయన అన్నారు. నయా ఉదారవాద విధానాల్లో విద్య, వైద్యం ప్రైవేటీకరణకు స్వాగతించి ప్రభుత్వ రంగాన్ని రక్షించుకోవాలనుకోవడం ఎండమావి కోసం పరిగెత్తడం వంటిదని ఆయన స్పష్టం చేశారు.
మన దేశంలోని ప్రజల కొనుగోలు శక్తి కంటే బ్రిటన్ లో ప్రజల కొనుగోలు శక్తి 18 శాతం ఎక్కువ, చైనాలో 5 శాతం ఎక్కువ, బ్రెజిల్ లో నాలుగు శాతం ఎక్కువ, కానీ మనతో సమానమైన ఆఫ్రికా దేశాలు నిలవడం మన పాలకుల అసమర్ధతకు తార్కానమని ఆయన అన్నారు. మనదేశంలో 94 శాతం యూనియన్ రహిత కార్మిక వర్గం ఉందని, కేవలం 6% యూనియన్ కార్మిక వర్గం ఉందని ఆయన అన్నారు. ఈ 94 శాతం లో ఐటీ, ఉబర్, ఓలా, రాపిడో, జొమాటో, సిగ్గి తదితర రంగాలలో పనిచేస్తున్న కార్మికుల హక్కులు కలరాయపడుతున్నాయని ఆయన అన్నారు. వీటిలో యువతరం అనేకులు ఉన్నారని వీరికి అర్థమయ్యే విధంగా మన కార్యాచరణ రూపొందించుకొని వారిని పోరాటాలలోకి దించడం మనందరి ప్రధాన కర్తవ్యం అని అదే పుచ్చలపల్లి సుందరయ్య గారి నిజమైన నివాళి అని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సదస్సుకు స్టీల్ సిఐటియు అధ్యక్షులు వైటి దాస్ అధ్యక్షత వహించారు. ముందుగా పుచ్చలపల్లి సుందరయ్య గారి చిత్రపటానికి వక్తలు పూలమాల వేశారు. అనంతరం ఇటీవల స్టీల్ ప్లాంట్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ముఖ్య కార్యకర్త ఉప్పిలి కన్నారావు అకాల మరణం పై సంతాపం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ సెక్టార్ కోఆర్డినేషన్ కమిటి కన్వీనర్ జ్యోతే శ్వరరావు, నగర సిఐటియు అధ్యక్షులు కె ఎం శ్రీనివాస్, స్టీల్ సిఐటియు ప్రధాన కార్యదర్శి యు రామస్వామి, పి శ్రీనివాసరాజు, ఒప్పంద కార్మిక సంఘ ప్రధాన కార్యదర్శి నమ్మి రవణ, స్టీల్ సిఐటియు నాయకులు బి అప్పారావు, కె గంగాధర్, యు వెంకటేశ్వర్లు, టివికె రాజు, పుల్లారావు, నీలకంఠం, కృష్ణమూర్తి, బి తౌడన్న, భానుమూర్తి, డి సి హెచ్ వెంకటేశ్వరరావు, డి ఎస్ ఆర్ సి మూర్తి, ఓ వి రావు, కె. పి సుబ్రహ్మణ్యం తదితరులతోపాటు వివిధ విభాగాల అధ్యక్ష కార్యదర్శులు, మహిళా సంఘం ప్రతినిధులు, అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. ముందుగా ప్రజానాట్యమండలి కళాకారులు విప్లవ గీతాలను ఆలపించారు.