ఆపదలో అండగా ఉంటాం. ఎవ్వరూ అధైర్యపడవద్దు. ఇప్పటికే మంటలు జరిగిన ఇళ్లలో వేలి ముద్ర నిపుణులు వాటి నమూనాలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. అతి త్వరలో ఆ రిపోర్టులు వస్తాయి. అప్పుడు కారణాలు ఏమిటన్నది తెలుస్తుంది. ఆ తర్వాత ఏమి చేయాలన్నది ఆలోచించి చేద్దాం. అప్పటి వరకు ఎవ్వరూ ఎక్కడకీ వెళ్లవద్దు. గ్రామంలో నిరంతరాయంగా పోలీసుల పహారా కొనసాగుతుంది అంటూ చంద్రగిరి ఎమ్మెల్యే, తుడా ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. చంద్రగిరి మండలం కొత్త శానంబట్లలో చంద్రగిరి శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కలెక్టర్ కె. వెంకటరమణా రెడ్డి, అడిషనల్ ఎస్పీ వెంకటరావు, ఆర్డీఓ కనకనరసారెడ్డి మండల స్థాయి అధికారులతో కలసి పర్యటించారు. మంటలు చెలరేగిన ఇళ్లను స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి ఇంట్లో జరిగిన ప్రమాదం గురించి కుటుంబీకులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం గ్రామస్తుల సమక్షంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ గత వారం రోజులుగా గ్రామంలో అక్కడక్కడ మంటలు చెలరేగుతున్న వాటిపై ఇప్పటికే నమూనాలు సేకరించి ల్యాబ్ కు పంపామని త్వరలో నివేదిక రానున్నదని, మానవ తప్పిదమో, ఆచార సంప్రదాయాల వల్ల జరిగిందా తెలుస్తుందని, రిపోర్టు రాగానే తక్షణ సహాయ చర్యలు చెప్పడానికే కలెక్టర్ వెంకటరమణారెడ్డిని తీసుకు వచ్చానన్నారు. పగలే మంటలు చెలరేగడం జరుగుతున్నది, చీకటి పడిన తర్వాత ఏమీ లేదని గ్రామస్తులు చెప్పడంతో భయాందోళన లేకుండా కుటుంబ సభ్యులకు అండగా గ్రామంలో మహిళా పోలీసులు 18 మందిని ఇక్కడే ఉంచుతామని అన్నారు. ఇప్పటికే మంటలు చెలరేగిన ఇండ్ల వద్ద పోలీసులు సిసి కెమరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్నారన్నారు.
అపోహలు, వదంతులు నమ్మవద్దని త్వరలో కారణాలు తెలుస్తాయని, మరో గ్రామంలో ఇలా జరగకుండా జాగ్రత్త పాడుదామని అన్నారు. గ్రామంలో భాదితులు అయిన అరుణ, రాణి, గోపి కృష్ణ గృహాలు సందర్శించి మంటలు జరిగిన విధానం గురించి అడిగి తెలుసుకుని దైర్యం చెప్పారు. ఈ పర్యటనలో పర్యావరణ ప్రొఫెసర్ దామోదర్, ఫైర్ అధికారి రమణయ్య, పోలీసు అధికారులు, స్థానికులు ఉన్నారు.