వైఎస్ అవినాశ్ రెడ్డి కేసు కోసమే ఆయన ఢిల్లీకి వెళ్తున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 27న ఢిల్లీకి వెళ్లబోయేది కచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని ఆయన అన్నారు. అవినాశ్ రెడ్డి అంశం సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తోందని అన్నారు. ఆయనను అరెస్ట్ చేయడానికి మీనమేషాలు ఎందుకు లెక్కిస్తున్నారని ప్రశ్నించారు.
తల్లికి ఆరోగ్యం బాగోలేకపోతే హైదరాబాద్ కు తీసుకెళ్లాలి కానీ కర్నూలుకు ఎందుకు తీసుకెళ్లారని అడిగారు. అవినాశ్ రెడ్డి ఆరు సార్లు సీబీఐ విచారణకు హాజరయ్యారని సజ్జల రామకృష్ణారెడ్డి చెపుతున్నారని... ఎన్ని సార్లు హాజరుకాలేదో కూడా ఆయన చెప్పాలని డిమాండ్ చేశారు. రూ. 2 వేల నోట్ల రద్దు మంచి నిర్ణయమని... ఆ నోట్లు ఎవరి వద్ద ఉన్నాయో వారికి ఇబ్బంది ఉంటుందని చెప్పారు.