అద్దంకి నియోజకవర్గంలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై అద్దంకి నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం బుధవారం బాపట్ల కలెక్టర్ కార్యాలయ అవరణలోని స్పందన సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన జరిగింది.
అద్దంకి పట్టణంలో ఏ ఏ బి పథకం కింద చేపట్టిన తాగునీటి ప్రాజెక్టు నిర్మాణ పనులను అధికారులు తక్షణమే పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రాజెక్టు కింద రూ. ఎనభై రెండు కోట్ల నిధులు మంజూరు అయ్యాయనన్నారు. పట్టణ ప్రాంతంలో 12 కిలోమీటర్ల మేర పైపు లైన్ నిర్మాణం పూర్తయినప్పటికీ వివిధ పనులు మిగిలాయన్నారు. అన్ని మండలాలలో తాగునీటి సమస్య పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అద్దంకిలో అమృత్ సరోవర్ కింద మాంజూరైన రూ. ఎనిమిది కోట్లతో చెరువులు అభివృద్ధి చేయాలన్నారు. పట్టణ శివారు ప్రాంతాలలో తాగునీరు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మాజీ శాసనసభ్యులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఆ ప్రాంతాలలో తక్షణమే తాగునీరు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మంజూరైన వాటర్ గ్రిడ్ నిర్మాణానికి స్థలం కేటాయించి పనులు వేగంగా ప్రారంభించాలన్నారు. జల జీవన్ మిషన్ కింద నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కారానికి రూ. వంద కోట్లు నిధులు మంజూరు కాగా పనులు సత్వరమే చేపట్టేలన్నారు.
గ్రామీణ ప్రాంత ప్రజల కొరకు స్మశాన భూమి కేటాయించేలా అధికారులు తక్షణమే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. స్మశాన భూమి కేటాయింపుల కొరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలన్నారు. ఆర్ అండ్ బి రహదారుల విస్తరణ పనులు చేపట్టాలని, జగనన్న కాలనీలకు అప్రోచ్ రోడ్లను ఉపాధి హామీ పథకం కింద నిర్మించాలన్నారు. నాడు-నేడు పాఠశాలల అభివృద్ధి పనులను జూన్ 12వ తేదీ లోగా నిర్ధేశించిన 10 రకాల పనులు పూర్తి చేసేలా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. గృహ నిర్మాణాలు శరవేగంగా జరిగేలా లబ్ధిదారులకు పొజిషన్ సర్టిఫికెట్లు జారీ చేయాలని కలెక్టర్ తెలిపారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు, గృహ నిర్మాణాలకు సంబంధించిన బిల్లులు మంజూరయ్యేలా చూడాలన్నారు. ఓ టి ఎస్ కింద నగదు చెల్లించిన వారికి రిజిస్ట్రేషన్ పూర్తి చేసి ఇవ్వాలని, సాంకేతిక అనుమతుల కోసం ప్రభుత్వానికి నివేదిక పంపాలన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు సజావుగా సాగడానికి అధికారులు సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలని కలెక్టర్ సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ సిహెచ్. శ్రీధర్, డీఆర్వో కె. లక్ష్మీశివజ్యోతి, డ్వామా పీడీ వై. శంకరనాయక్, శాప్ చైర్మన్ బాచిన చైతన్య ప్రసాద్, మాజీ శాసనసభ్యులు బాచిన చెంచు గరటయ్య, జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.