మనీలాండరింగ్ కేసులో అరెస్టయి తిహాడ్ జైల్లో ఉన్న ఆప్ నేత, దిల్లీ మాజీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ ఆరోగ్యం మరింత క్షీణించింది.ఈ ఉదయం ఆయన జైలు గదిలోని బాత్‌రూమ్‌లో స్పృహతప్పి పడిపోయిన విషయం తెలిసిందే. దీంతో జైలు అధికారులు వెంటనే ఆయన్ను దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే అక్కడ ఆయన పరిస్థితి విషమించడంతో నగరంలోని ఎల్ఎన్‌జేపీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆక్సిజన్ సపోర్ట్‌పై ఉన్నట్లు జైలు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
సత్యేందర్ జైన్ ఆరోగ్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ఉదయం ప్రకటన చేసింది. బాత్‌రూమ్‌లో కళ్లుతిరగడంతో ఆయన కిందపడిపోయారని, దీంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించారని తెలిపింది. అయితే, గతంలో ఆయన ఇలాగే ఓసారి బాత్‌రూమ్‌లో పడిపోవడంతో వెన్నెముకకు తీవ్ర గాయమైందని తెలిపింది. మరోవైపు, గత సోమవారం కూడా జైన్ అస్వస్థతకు గురవడంతో జైలు అధికారులు ఆయన్ను ఆసుపత్రికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. అప్పుడు బయటికొచ్చిన చిత్రాలు ఆప్ నేతలను దిగ్భ్రాంతికి గురిచేశాయి. అందులో ఆయన బక్కచిక్కి పోయి చాలా నీరసంగా కన్పించారు. వెన్నెముకకు గాయమవడంతో నడుముకు బెల్ట్ పెట్టుకున్నారు.
కొంతకాలంగా వెన్నెముక సమస్యతో బాధపడుతున్న జైన్.. పలుమార్లు బెయిల్‌కు ప్రయత్నించినప్పటికీ న్యాయస్థానాల్లో ఆయనకు ఊరట లభించడంలేదు. ఈ క్రమంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తరఫున పిటిషన్ వేసిన సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీ.. జైల్లో ఉన్న సమయంలో జైన్ 35 కిలోల బరువు తగ్గారని ధర్మాసనం ముందు విన్నవించారు. పరిగణనలోకి తీసుకున్న సుప్రీం ధర్మాసనం.. పిటిషన్ అత్యవసర విచారణ కోసం వెకేషన్ బెంచ్‌ను ఆశ్రయించేందుకు అవకాశం కల్పించింది.