తమ తెలుగుదేశం పార్టీ మినీ మేనిఫెస్టోతో వైసీపీ నేతలకు భయం పట్టుకుందని.. మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు వ్యాఖ్యానించారు. మహానాడు 2023, టీడీపీ ఆరు హామీలపై ఆయన స్పందించారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను ఎంతో పవిత్రంగా చూస్తుందని ఆయన వివరించారు. మొన్న విడుదల చేసిన మేనిఫెస్టో ట్రైలర్ మాత్రమేనని.. అసలు సినిమా ముందిందని వ్యాఖ్యానించారు. టీడీపీ మేనిఫెస్టో ప్రజల గుండెచప్పుడు అని అభివర్ణించారు.
రాజమండ్రిలో మహనాడు 2023 విజయవంతమైందని గంటా శ్రీనివాస రావు చెప్పారు. ఏపీలో విధ్వంసం, ఆరాచక పాలనలో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ జగన్ మోహన్ రెడ్డి మెడలు వంచుతున్నారని విమర్శించారు. మద్యపానం నిషేధం అని ప్రజలను మోసం చేశారన్నారు. విశాఖ రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టులను గాలికి వదిలేశారని విమర్శించారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. వైసీపీ విజయానికి కృషి చేసిన విజయమ్మ, షర్మిల ఎక్కడ ఉన్నారో ప్రజలు ఆలోచన చేయాలని సూచించారు.