కొన్ని సందర్భాలలో పాలకుల పుత్రరత్నాలు చేసే పనులకు తండ్రులు బలవుతుంటారు. తాజాగా కుమారుడి నిర్వాకం జపాన్ ప్రధానమంత్రి పుమియో కిషిదకు తలనొప్పిగా మారింది. చివరకు తన రాజకీయ వ్యవహారాల కార్యదర్శిగా ఉన్న అతడ్ని పదవి నుంచి తప్పించాల్సి వచ్చింది. దీనికి కారణం గతేడాది ప్రధాని అధికారిక నివాసంలో ఓ ప్రైవేటు పార్టీ నిర్వహించడమే. ప్రధాని కుమారుడు షొటారో కిషిదా.. డిసెంబర్ 30 తన బంధువులతో కలిసి ఇంట్లో పార్టీ చేసుకున్నారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోలు బయటరావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో కుమారుడిపై ప్రధాని కిషిద చర్యలు తీసుకున్నారు.
ప్రధాని అధికారిక నివాసంలో నిర్వహించిన పార్టీకి కిషిద కుమారుడితోపాటు పలువురు బంధువులు హాజరయ్యారు. ఆ సందర్భంగా అక్కడ రెడ్ కార్పెట్ మెట్లపై నిలబడి.. కొత్తగా క్యాబినెట్‌లో చేరిన మంత్రుల్లా ఫొటోలకు పోజులిచ్చారు. వారి మధ్యలో ప్రధాని కుమారుడు (ప్రధాని ఉండాల్సిన చోట) నిలబడి ఫొటోలు దిగారు. అంతటితో ఆగకుండా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లుగా.. పోడియం వద్ద అతిథుల్లా నిల్చొని మరిన్ని ఫొటోలు తీసుకున్నారు. ఈ ఫోటోలను తాజాగా స్థానిక మాసపత్రిక ప్రచురించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
దీంతో ప్రధాని, అయన కుమారుడిపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తన రాజకీయ వ్యవహారాల కార్యదర్శి పదవి నుంచి కుమారుడిని తప్పిస్తున్నట్లు ప్రధాని కిషిద ప్రకటించారు. అయితే, కిషిద కుమారుడు అధికార దుర్వినియోగానికి పాల్పడటం ఇదేం మొదటిసారి కాదు. బ్రిటన్, పారిస్ పర్యటనలో భాగంగా వ్యక్తిగత టూర్లకు అక్కడి ఎంబసీ కార్లను ఉపయోగించి విమర్శలను ఎదుర్కొన్నారు.
తాజా వివాదంపై జపాన్ ప్రధాని ఫుమియో స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘ప్రధానికి రాజకీయ వ్యవహారాల కార్యదర్శిగా ఉన్న వ్యక్తి చర్యలు అనుచితమైనవి.. అందుకు ఆయనను బాధ్యుడిగా చేస్తూ.. పదవి నుంచి తొలగిస్తున్నాను.. ఆయన స్థానంలో మరోవ్యక్తిని నియమించాలని నిర్ణయించాను’ అని కిషిద పేర్కొన్నారు. అయితే, ఆ పార్టీకి వచ్చిన వారికి తానూ శుభాకాంక్షలు చెప్పానని.. కానీ, డిన్నర్ సమయంలో అక్కడ లేనని ప్రధాని కిషిద స్పష్టం చేశారు. ప్రధానికి తెలిసే పార్టీ జరగడం గమనార్హం. ప్రధాని ప్రకటనపై ప్రతిపక్ష నేత సెజీ ఒసాకా విమర్శలు గుప్పించారు. ‘ఇది చాలా ఆలస్యం. నేను (కిషిదా) ప్రధానమంత్రికి సహాయకుడిగా ఉండే సామర్థ్యం లేని వ్యక్తిని ఆ పదవికి నియమించినట్లు అనుమానిస్తున్నాను’ అని చెప్పారు.