అమెరికాలోని ఫిలడెల్ఫియాలో దుండుగులు జరిపిన కాల్పుల్లో మరో భారత సంతతి విద్యార్ధి మృతిచెందాడు. ఆదివారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తుల జరిపిన కాల్పుల్లో చనిపోయిన యువకుడ్ని కేరళ సంతతికి చెందిన జుడే చాకోగా గుర్తించారు. కేరళలోని కొల్లం జిల్లాకు చెందిన బాధితుడి తల్లిదండ్రులు దాదాపు 30 ఏళ్ల కిందట అమెరికాకు వలస వెళ్లినట్టు మీడియా నివేదికలు వెల్లడించాయి. చదువును కొనసాగిస్తూనే చాకో పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం విధులకు వెళ్లి తిరిగొస్తుండగా.. దుండుగులు మార్గమధ్యలో దాడికి పాల్పడ్డారు. దోచుకునే ప్రయత్నంలో కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు.
ఇదిలావుంటే ఈ ఏడాది ఇప్పటి వరకూ అమెరికాలో గన్ కల్చర్‌కు ఇద్దరు భారతీయ విద్యార్ధులు బలైపోయారు. గత నెలలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్ధిని దుండుగులు కాల్చిచంపారు. అమెరికాలోని ఓహియోలో మాస్టర్స్ చేస్తోన్న ఏలూరు నగరానికి చెందిన సైయేశ్ వీర (24) ఏప్రిల్ 21న దుండగుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. పార్ట్-టైమ్ ఉద్యోగం చేస్తోన్న అతడు.. తాను పనిచేస్తోన్న పెట్రోల్ బంక్‌లో హత్యకు గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన అతడ్ని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించేసరికే చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. నిందితుడి ఫోటోలను విడుదల చేసిన పోలీసులు.. అనుమానితుడ్ని గుర్తించడానికి సహకరించాలని కోరారు.