ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తొమ్మిదేళ్ల పాలనపై ఏపీలో యాభై లక్షల కరపత్రాల పంపిణీకి రాష్ట్ర బీజేపీ నేతలు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం ఏపీ బీజేపీ అధ్యక్షులు సోమువీర్రాజు, మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ... స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడూ లేని విధంగా మోడీ అభివృద్ధి చేశారన్నారు. ఈ తొమ్మిదేళ్లలో నవ భారత్ ఆవిష్కృతమైందని.. ఈ విషయం మోర్గాన్ అనే పెద్ద సంస్థలే చెబుతున్నాయని తెలిపారు. పేద, ధనిక మధ్య భారీ వ్యత్యాసం ఉండేదన్నారు. నేడు పేదలకు అన్ని రకాల సదుపాయాలు కల్పించి జీవన ప్రమాణాలు పెంచారని తెలిపారు. భారతదేశం నుంచే ఇతర దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ సరపరా చేశామన్నారు. జనాభాలో చైనాను భారతదేశం మించి పోయిందన్నారు. అయినా కోవిడ్ సమయంలో ప్రాణ నష్టం చాలా వరకు నివారించారని చెప్పారు. ఏపీలో విభజన చట్టంలో ఉన్న అనేక అంశాలను మోడీ అమలు చేశారన్నారు. మోడీ పాలనలో ఏపీకి విద్యా సంస్థలు, ఎయిమ్స్, జాతీయ రహదారులు నిర్మాణం జరిగిందని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం అసమర్థత వల్ల పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగలేదని విమర్శించారు. ప్రాజెక్టుల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం స్థలాలు కూడా కేటాయించలేదన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. గత, ప్రస్తుత ప్రభుత్వాల వల్ల పోలవరం ఆలస్యం అయ్యిందని వ్యాఖ్యానించారు. రాజధాని అమరావతిని అభివృద్ధి చేయకుండా జగన్ నాశనం చేశారని మండిపడ్డారు. మోడీ నిధులు ఇచ్చినా మూడు రాజధానులు పేరుతో రాష్ట్ర అభివృద్ధిని ఆపేశారని ఆయన అన్నారు.