చిలకలూరిపేట నియోజకవర్గ కేంద్రమైన చిలకలూరిపేట పట్టణంలో 1977లో ప్రారంభమైన అగ్ని మాపక కేంద్రం ప్రస్తుతం సమస్యల మంటల్లో చిక్కుకుంది. ఈ కేంద్రం పరిధిలో చికలూరిపేట, యడ్లపాడు, నాదెండ్ల, పెదనందిపాడులో సగభాగం, మార్టురు మండలాల్లోని 70-90 గ్రామాలున్నాయి. ఈ కేంద్రానికి సింగిల్ యూనిట్ కింద ఒక అగ్నిమాపక వాహనం ఉండగా రెండెకరాల్లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఇందులో ఎక్కువ భాగాన్ని మున్సిపాల్టీ వినియోగిస్తుండగా అగ్నిమాపక కేంద్రం 70-80 సెంట్లకే పరిమితమైంది. సిబ్బంది విశ్రాంతి తీసుకోవడానికి గదులు కరువయ్యాయి. రేకుల షెడ్డులో నానా అవస్థ పడుతున్నారు. అగ్నిమాపక కేంద్రంలో ఒక ఎస్‌ఐ, 16 మంది లీడింగ్ ఫైర్‌మెన్లు (ఎల్‌ఎఫ్), ముగ్గురు డ్రైవర్లు మొత్తం 20 మంది సిబ్బంది ఉండాలి. ప్రస్తుతం చిలకలూరిపేటలో 10 మందే ఎల్‌ఎఫ్‌లు ఉండగా ఆరు ఖాళీగా ఉన్నాయి. ఒక డ్రైవర్ పోస్టు ఖాళీగా ఉంది. స్టేషన్ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న మరో డ్రైవర్ దీర్ఘకాలిక సెలవులో ఉన్నారు. దీంతోఉన్న సిబ్బందిపైనే పని భారం పడుతోంది.
అగ్నిమాపక కేంద్రానికి ఉన్న వాహనా నీటి సామర్థ్యం 4-5 వేల లీటర్లు ఉంటుంది. కేంద్రం పక్కనే సుమారు 50 అడుగుల దూరంలో మున్సిపాలిటీకి చెందిన వాటర్ ట్యాంకులున్నా వాటి నుండి ఫైరింజన్లకు నీరు నింపడానికి అనుమతులు ఇవ్వడం లేదు. దీంతో మూడున్నర కిలోమీటర్ల దూరంలోని ఓగేరే వాగు పక్కనున్న బావి వద్దకు వెళ్లి నీటిని నింపుతున్నారు.