మంగళగిరి - తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని 16వ నంబరు జాతీయ రహదారిపై బ్రేక్ ఇన్స్పెక్టర్ పేరుతో ఓ వ్యక్తి వాహనదారుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడిన సంఘటన గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంతో వెలుగుచూసింది. సేకరించిన వివరాల ప్రకారం విజయవాడ కృష్ణలంకకు చెందిన గుంపెన శ్రీనివాసరావు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే లారీలకు దారి చూపించేందుకు గైడ్ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో తాడేపల్లి బైపాస్ రోడ్డులోని పలు ప్రాంతాల్లో అధికలోడుతో వెళుతున్న ఆటోలు ఆపి వారి నుంచి అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నాడు.
విజయవాడ నుంచి ఓ వాహనంలో ఎక్కువ మందితో కనకదుర్గమ్మ గుడికి వెళుతున్న సమయంలో ఆటోఆపి వారి నుంచి కొంత నగదు తీసుకున్నాడు. ఇదే సమయంలో విజయవాడవైపు నుంచి వస్తున్న ఓ ద్విచక్రవాహనం ఆగి ఉన్న ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో అతనికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు సమాచారం అందుకుని ఘటనా స్థలానికి వెళ్లడంతో బ్రేక్ ఇన్స్పెక్టర్ విషయం బయటపడడంతో శ్రీనివాసరావుని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఘటనపై సీఐను వివరణ కోరగా ఈ ఘటనపై ఇప్పటివరకు తాడేపల్లి పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ప్రస్తుతం విచారిస్తున్నామని విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామన్నారు.