ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు తిరుమల శ్రీవారిని దర్శించుకుని శ్రీకాళహస్తికి బయలుదేరారు. మరో పదినిమిషాలు ప్రయాణిస్తే వారు ముక్కంటి ఆలయానికి చేరుకుంటారనగా అతివేగంతో ప్రయాణిస్తున్న వారి కారు ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఘటనాస్థలంలోనే ముగ్గురు మరణించగా, ఆస్పత్రిలో మరొకరు చనిపోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం మేర్లపాక వద్ద గురువారం ఉదయం జరిగిన ఈ విషాద ఘటన వివరాలు.. తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లెకు చెందిన వెంకటమ్మ(65), ఆమె కుమారులు అశోక్ (45), దినేష్, రాంబాబుతో పాటు దినేష్ కుమార్తెలు జాన్వితాక్షరి, శానితాక్షరి(6) బుధవారం సాయంత్రం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం ఉదయం శ్రీకాళహస్తీశ్వరస్వామి దర్శనార్థం బయల్దేరారు. మార్గమధ్యలో ఏర్పేడు మండలం మేర్లపాక చెరువు గట్టు వద్ద జాతీయ రహదారిపై ముందు వెళుతున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును వారి కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో వెంకటమ్మతో పాటు అశోక్, చిన్న మనవరాలు శానితాక్షరి మృతి చెందారు. ఏర్పేడు సీఐ శ్రీహరి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని కారులో ఇరుక్కున్న మృతదేహాలను బయటకు తీసి శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను తిరుపతిలోని నారాయణాద్రి ఆస్పత్రికి తరలించారు. అక్కడ దినేష్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. జాన్వితాక్షరి పరిస్థితి విషమంగా ఉంది.