నెల్లూరు రూరల్ మండలంలోని అంబాపురం వద్ద నిర్మిస్తున్న జగనన్న కాలనీలో నాసిరకం నిర్మాణాలతో గోడలు బలహీనపడి ఏకంగా 11 ఇళ్లు నేలమట్టం అయ్యాయి. ఈదురుగాలులకుతోడు.. పడిన కొద్ది వర్షానికే శ్లాబు వరకు నిర్మించిన గోడలు కూలిపోయాయి. ఇవన్నీ ప్రభుత్వమే కట్టిస్తున్న ఇళ్లు కావడం గమనార్హం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 22, 23, 24, 31 డివిజన్లలోని పేదల కోసం అంబాపురం వద్ద జగనన్న కాలనీ ఏర్పాటుచేసి తొలుత స్థలాలను కేటాయించారు. కట్టుబడికి ఇచ్చిన మూడు ఆప్షన్లలో ఒకటైన ప్రభుత్వమే కట్టిచ్చే విధానాన్ని పేదలు ఎంచుకున్నారు. దీంతో కాంట్రాక్టర్లకు నిర్మాణ బాధ్యతలు అప్పగించి గృహ నిర్మాణ సంస్థ పర్యవేక్షణ బాధ్యతలను చూస్తోంది. ఇక్కడ మొత్తం 5,200 ఇళ్లను నిర్మిస్తుండగా, సగం ఇళ్లకు పైగా శ్లాబు దశకు చేరుకున్నాయి. గత నెల 30వ తేదీ మధ్యాహ్నం ఈదురుగాలులకు తోడు స్వల్ప వర్షం కురిసింది. అంతే... నాణ్యతాలోపం కారణంగా బలహీనంగా ఉన్న గోడలు కుప్పకూలాయి. వరుసగా 11 ఇళ్ల గోడలు నేలమట్టం అయ్యాయి. ఇది గమనించిన అధికారులు, కాంట్రాక్టర్లు..హుటాహుటిన వాటికి మరమ్మతు చేసే పనిలోపడ్డారు. తక్కువ మోతాదులో సిమెంట్, అధిక మోతాదులో ఇసుక వినియోగించడం వల్లే ఇలా జరిగిందని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. కాగా, అంబాపురం వద్ద జగనన్న ఇళ్లు మాత్రమే కాకుండా.. విద్యుత్ స్తంభాలూ నాశిరకంగానే ఉన్నాయి. ఈ కాలనీలో ఎవరూ గృహ ప్రవేశం చేయకముందే విద్యుత్ స్తంభాలు విరిగిపోతున్నాయి. మరికొన్ని వాలిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది అని టీడీపీ నాయకులు వాపోతున్నారు. కాగా శ్రీహరిగోపాల్, డీఈఈ స్పందిస్తూ.... ‘‘వర్షం, గాలులకు సిమెంట్, ఇసుక కారిపోవడం వల్ల గోడలు కూలిపోయాయి. వాటిని సరిచేస్తున్నాం. అవన్నీ ఆ రోజు కట్టినవి కాబట్టి అలా జరిగిందంతే. నాశిరకం నిర్మాణాలు కాదు’’ అని వివరణ ఇచ్చారు.