ప్రాధమిక, ప్రాధమికోన్నత పాఠశాల విద్యను నిర్వీర్యం చేసి, విద్యార్థుల భవితవ్యంతో ఆట్లాడేవిధంగా విద్యాశాఖ నిర్ణయాలు ఉన్నాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, పెందుర్తి నియోజకవర్గం పరిశీలకులు గంటా నూకరాజు అన్నారు. భీమిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం గంటా నూకరాజు మీడియాతో మాట్లాడారు. 1వ తరగతి నుండి 8వ తరగతి వరకు ఉన్న పాఠశాలలను ప్రాధమికోన్నత పాఠశాలలుగా పరిగనిస్తారని అన్నారు. అందులో 3 నుండి 8వ తరగతి వరకు విద్యార్థులు 99 మంది కంటే తక్కువ ఉంటే స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులను వేరే పాఠశాలకు బదిలీ చేయాలని విద్యాశాఖ తీసుకున్న నిర్ణయం సరైనది కాదని అన్నారు. యూపి స్కూల్లో 6, 7, 8 తరగతులు కూడా ఉంటాయని వీరికి సబ్జెక్ట్ పరంగా ఉపాధ్యాయులు పాఠాలను బోదించాల్సి వస్తుందని అన్నారు. ఒక ప్రాధమికోన్నత పాఠశాలలో 4 నుండి 5 మంది స్కూల్ అసిస్టెంట్లు, ఇద్దరు లేక ముగ్గురు ఎస్ జి టి లు ఉంటారని అన్నారు. విద్యార్థులు తక్కువగా ఉన్నారని స్కూల్ అసిస్టెంట్ లను వేరే పాఠశాలకు బదిలీ చేస్తే ఇదే పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల పరిస్థితి ఏంటని విద్యా శాఖను గంటా నూకరాజు ప్రశ్నించారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఎసరు పెట్టడమే ప్రభుత్వ లక్ష్యమా.? విద్యార్థుల భవితవ్యంతో విద్యాశాఖకు సంబంధం లేదా.? అని ఘాటుగా ప్రశ్నించారు. ప్రతీ నిరుపేద కుటుంబంలో ఉన్న పిల్లలందరూ పాఠశాలకు వెళ్లి చదువుకోవాలని ప్రతీ గ్రామానికి పారశాలను ఏర్పాటు చేసిన గత ప్రభుత్వ నిర్ణయాలకు ఇప్పుడు మీరు తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యత్యాసం గమనించారా.? అని అడిగారు.