ఒడిశాలో శుక్రవారం రాత్రి కోరమాండల్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి గురైన దాదాపు అరగంటలోపే ఎన్డీఆర్‌ఎఫ్ తొలి బృందం ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. అయితే, రెస్క్యూ సిబ్బంది అంత వేగంగా స్పందించి, తక్షణమే చేరుకోవడానికి ఆ రైలు ప్రయాణిస్తున్న ఓ ఎన్డీఆర్‌ఎఫ్ జవాన్ కీలకంగా వ్యవహరించాడు. ప్రమాదం జరిగిన కొద్ది నిమిషాల్లోనే జీపీఎస్ లొకేషన్, ఘటనా స్థలిలో ఫొటోలను పై అధికారులకు అతడు షేర్ చేయడంతో ఎన్డీఆర్ఎఫ్బృందం వేగంగా చేరుకోగలిగింది.
కోల్‌కతాలోని ఎన్డీఆర్ఎఫ్ రెండో బెటాలియన్‌లో తమిళనాడుకు చెందిన ఎన్ కే వెంకటేశన్ (39) జవాన్‌గా పనిచేస్తున్నాడు. తన బంధువుల ఇంట్లో శుభకార్యం కోసం సెలవుపై తమిళనాడుకు బయలుదేరాడు. ఈ క్రమంలో హౌరా స్టేషన్‌లో షాలీమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కాడు. బీ-7 కోచ్‌లోని 68 నెంబర్ సీటు రావడంతో రైలు ఎక్కిన వెంటనే మొబైల్ ఫోన్‌లో నిమగ్నమయ్యాడు. ఈ క్రమంలో దాదాపు రాత్రి 7 గంటల సమయంలో రైలు భారీ శబ్దంతో కుదుపులకు గురయ్యింది. తన ఎదురు బెర్తులో పడుకొన్న వ్యక్తి.. ఆ పక్కనే ఉన్న ఓ మహిళ చేతిలో ఉన్న చంటి బిడ్డ కిందపడింది.
దీంతో రైలులో ఏదైనా బాంబు పేలిందేమోనని భావించిన వెంకటేశన్ అప్రమత్తం అయ్యాడు. వెంటనే రైలు బోగి నుంచి బయటపడి ఫోన్ టార్చ్‌ను ఆన్ చేసి.. అక్కడ దృశ్యాన్ని చూసి షాకయ్యాడు. వెంటనే తేరుకుని కోచ్‌ల్లో చిక్కుకొన్న వారిలో కొందరిని రక్షించారు. ప్రమాదం తర్వాత వచ్చిన శబ్దం విని అక్కడకు చేరుకొన్న స్థానికులకు పలు సూచనలు చేశాడు. కానీ, పరిస్థితి దారుణంగా ఉండటంతో వెంటనే ఈ విషయం గురించి తన పై అధికారికి ఫోన్‌లో సమాచారం ఇచ్చాడు. ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకుని, ప్రమాదం ఫొటోలను వాట్సాప్‌లో పంపాడు. కొద్దిసేపటి తర్వాత జీపీఎస్ లొకేషన్ కూడా షేర్ చేశాడు.
ఈ ఘటనపై ఎన్డీఆర్‌ఎఫ్ డీఐజీ మొహిసీన్ షాహెది మాట్లాడుతూ.. ‘‘జవాన్ వెంకటేశన్ తొలుత మాకు సమాచారం అందజేశాడు.. దీంతో వెంటనే మా ప్రధాన కార్యాలయంలోని సీనియర్ అధికారి అలర్టయ్యారు.. ప్రమాదం జరిగిన పావుగంటలోపే బాలాసోర్‌కు తొలి ఎన్డీఆర్‌ఎఫ్ బృందం ఘటనా స్థలికి వెళ్లింది.. ఆ తర్వాత మిగిలిన బృందాలు కూడా అక్కడకు చేరుకున్నాయి’’ అని చెప్పారు. దాదాపు 300 మంది ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది రైలు ప్రమాదం జరిగిన చోట సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
వెంకటేశన్ మాట్లాడుతూ..‘రాత్రి 7 గంటల సమయంలో రైలు భారీ కుదుపులకు లోనయ్యింది.. నేను ఉన్న బోగీలోని పలువురు ప్రయాణికులు కిందపడిపోవడం చూశాను.. నేను మొదటి ప్రయాణికుడిని బయటకు తీసుకువచ్చి రైల్వే ట్రాక్ దగ్గర ఉన్న ఒక దుకాణంలో కూర్చోబెట్టాను.. నేను ఇతరులకు సహాయం చేయడానికి పరుగెత్తాను.. మెడికల్ షాపు ఓనర్ సహా స్థానికులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.. బాధితులను తమకు తోచిన విధంగా కాపాడటానికి ప్రయత్నించిన వాళ్లే నిజమైన హీరోలు’ అని అన్నారు. బీఎస్ఎఫ్‌లో పదవీవిరమణ చేసిన వెంకటేశన్.. 2021లో ఎన్డీఆర్ఎఫ్‌లో చేరారు.