ఒడిశాలో జరిగిన రైలు ప్రమాద ఘటనాస్థలికి వెళ్లి తెలుగువారిని కలిశామని.. క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం భువనేశ్వర్ సహా పలు ఆస్పత్రులకు పంపామని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ చెందిన వారు 309 మంది కోరమాండల్‌లో, 33మంది యశ్వంత్ పూర్‌లో మొత్తంగా 342 మంది ప్రయాణించారని గుర్తించినట్లు చెప్పారు. ప్రయాణించిన వారందరి వివరాలు ట్రేస్ అయ్యాయన్నారు. ప్రమాదంలో ఏపీకి చెందిన 12 మంది మైనర్ గాయాలయ్యాయని.. ప్రస్తుతం విశాఖలో 8 మందికి చికిత్స అందించామని చెప్పారు. జనరల్ బోగీల్లో ప్రయాణించిన శ్రీకాకుళంకు చెందిన గురుమూర్తి అనే వ్యక్తి ఒక్కరే మృతి చెందినట్లు చెప్పారు. జనరల్ బోగీల్లో వెళ్లిన వారిలో ఇద్దరు విశాఖ, ఇద్దరు శ్రీకాకుళం వారు క్షేమంగా ఉన్నారని గుర్తించామని మంత్రి అన్నారు.