తిరుపతి జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లకు పోలీసులు దిమ్మతిరిగే షాకిచ్చారు. యర్రావారిపాళెం మండలం బోడెవాండ్లపల్లె సమీపంలో.. సాయికాడ గుట్టు వద్ద ఎర్రచందనం చెక్కలు, పొడి, ముక్కలను లారీలో తరలిస్తుండగా.. పోలీసులు పట్టుకున్నారు. 72 చెక్కలు, 4 చెక్క పీసుల మూటలు, 8 చెక్క పొడి బ్యాగులతో పాటు రెండు కార్లు, ఒక లారీ స్వాధీనం చేసుకుని.. ఐదుగురిని అరెస్ట్ చేశామని డీఎస్పీ యశ్వంత్ వెల్లడించారు. పట్టుకున్న మొత్తం సొత్తు విలువ సుమారు కోటి రూపాయలు ఉంటుందని వివరించారు.
ఈ తరహా స్మగ్లింగ్ ఇదే మొదటి సారి అని డీఎస్పీ యశ్వంత్ చెప్పారు. పట్టుబడిన స్మగ్లర్లలో తమిళనాడుకు చెందిన మహమ్మద్ రసూల్, కార్తీక్, భాస్కరన్ జేసురాజ్‌లతో పాటు అన్నమయ్య జిల్లా సిద్దారెడ్డిపల్లికి చెందిన తిరుమల శెట్టి నాగరాజు, వీరబల్లికి మండలానికి చెందిన అమరేంద్ర రాజు ఉన్నట్టు వెల్లడించారు. మహమ్మద్ రసూల్‌పై ఇప్పటికే 25 కేసులు ఉన్నాయని.. పీడీ యాక్ట్ కూడా నమోదైందని డీఎస్పీ వెల్లడించారు. పట్టుబడ్డ స్మగ్లర్లు ఇచ్చిన సమాచారంతో.. ఢిల్లీలో ఉన్న ఇద్దరు బడా వ్యక్తుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.