నెల్లూరు జిల్లా, మర్రిపాడు మండలంలోని డీసీ పల్లి పొగాకు బోర్డులో పొగాకు వేలం గురువారంతో ముగియనుంది. బోర్డు పరిధిలోని 10 మండలాల్లో 1,721 పొగాకు బ్యారన్‌లు, 2,129 మంది రైతులు బోర్డులో రిజిస్టరు చేసుకున్నారు. ఈ ప్రకారం 6.28 మిలియన్ కేజీలను కొనుగోలు చేసేందుకు అనుమతి ఉంది. అయితే మంగళవారం నాటికి 5.9 మిలియన్ కేజీల పొగాకు కొనుగోలు చేయగా రూ.11.6 కోట్ల వ్యాపారం జరిగింది. రైతులకు బోర్డు ఇచ్చిన అనుమతుల ప్రకారం బుధ, గురువారాల్లో జరిగే వేలంలో 6.28 మిలియన్ కేజీల పొగాకుకు వేలం జరగనుంది. దీంతో ఈ ఏడాది పొగాకు రైతులు ఆశించిన దానికంటే మంచి ధర పలకడంతో లాభాలు వస్తాయని ఆనందరం వ్యక్తమవుతోంది. కాగా గత ఏడాది కూలి పెరగడంతో పాటు ఎరువులు, మందులకు పెట్టుబడి పెరగడంతో భయపడి బోర్డులో బ్యారన్ రిజిస్టరు చేసుకునే సమయంలోనే 310 మంది రైతులు పొగాకు సాగు చేయలేమని బోర్డుకు రాసిచ్చారు. ఆ సంవత్సరం అనుకోకుండా ధరలు ఆశాజనకంగా ఉండడంతో రైతులు మంచి లాభాలను ఆర్జించారు. 4.89 మిలియన్ కిలోల పొగాకు కొనుగోలు చేయగా 83.89 కోట్ల వ్యాపారం జరిగింది. ఈ ఏడాది లాభాలను చూసి ఈ ఏడాది కొత్త పాత రైతులంతా పొగాకు సాగు చేసేందుకు సిద్ధపడ్డారు. రైతులకు బోర్డు ఇచ్చిన అనుమతుల ప్రకారం గురువారంతో వేలం ముగియనుండడంతో బోర్డు పరిధిలోని రైతుల వద్ద అనుమతికి మించి సాగు చేసిన పొగాకు అదనంగా సుమారు 2 మిలియన్ కేజీల పొగాకు ఉంది. ఆ పొగాకును కొనుగోలు చేసేందుకు వెసులు బాటు కల్పించాలంటూ బోర్డు అధికారులు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి మండలి అనుమతి కోరనున్నారు. వారం పది రోజుల్లో అనుమతులు వచ్చిన వెంటనే రైతుల నుంచి అదనపు పొగాకును కొనుగోలు చేస్తారు. ఈ ఏడాది ధరలు ప్రారంభంలో ఆశాజనకంగా ఉన్నా మధ్యలో మార్కెట్ పడిపోతుందనుకున్నారు. కానీ ప్రారంభం నాటి నుంచి క్వింటా రూ17,000 నుంచి క్రమేపి రూ.21,220 పెరిగింది. చివరకు స్ర్కాప్ (సూర)ను ప్రతి ఏటా బయట వ్యక్తులకు కేజీ రూ.20కు కొనేవారు. ఈ ఏడాది ప్రత్యేకించి బోర్డులో రూ.80 నుంచి రూ.110 వరకు కొనుగోలు చేశారు.