కృష్ణ జిల్లా, చించినాడ ఘటనలో దళితులపై అధికార పార్టీ దమనకాండ సాగించిందని నిమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. గణపవరంలో విలేకరులతో మాట్లాడుతూ ఏడు దశాబ్దాలుగా దళితులు సాగు చేస్తున్న భూములను కాపాడుకునేందుకు తన ప్రాణాలను సైతం పణంగా పెడతానని స్పష్టం చేశారు. దళితుల భూముల్లో వైసీపీ నేతలు అక్రమంగా మట్టిని అపహరించుకుపోతున్నారని వాటిని రక్షించుకునేందుకు దళితులు చేస్తున్న పోరాటానికి సంఘీభావం తెలిపి 24 గంటలపాటు నిరసన చేపట్టానన్నారు. అధికారులు, పోలీసులు సమస్య పరిష్కారానికి చూడకుండా దళితులపై లాఠీచార్జి చేసి తనను అక్రమంగా అరెస్టు చేసి మండుటెండల్లో నాలుగు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పి గణపవరం స్టేషన్‌లో నిర్బంధించారని తెలిపారు. పోలీసులు అరెస్టు చేసినప్పుడు మెడకు దెబ్బ తగలడంతో గణపవరం ప్రభుత్వ వైద్యాధికారి సంతోష్ వైద్య పరీక్షలు చేశారన్నారు. ఆందోళనలో టీడీపీ నాయకులు రాష్ట్ర కార్యదర్శి పెచ్చెట్టి బాబు, నాయకులు బోనం నాని, గండేటి వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు.