ఆ వ్యక్తి మరణించి 12 ఏళ్లు గడచింది. అయినా అతని పేరుతో ఇతరులు పింఛన్ పొందుతున్న వింత కేసు పల్నాడు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరులో వెలుగు చూసింది. ఈ కేసుకు సంబందించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. క్రోసూరు మండలం దొడ్లేరుకు చెందిన పారా కిరీటయ్య 2012లో తన 70 సంవత్సరాల వయస్సులో మరణించాడు. అయితే ఆయన రెండో కుమారుడు పారా శౌరయ్య తన తండ్రి పేరుతో వస్తున్న పింఛన్‌ను తన మాయ అయిన రాజయ్యకు నకిలీ ఆధార్ కార్డు సృష్టించి అధికారులను మభ్య పెట్టి పింఛన్ మంజూరు చేయించుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ నెలలో కూడా మొత్తం సుమారు రూ.4 లక్షలు ప్రభుత్వం నుంచి మరణించిన వ్యక్తి పేరుతో పింఛన్ పంపిణీ జరుగుతూనే ఉంది. విషయాన్ని తెలుసుకున్న కిరీటయ్య బంధువులు జిల్లా కలెక్టర్‌కు, ఇతర ఉన్నతాధికారులకు చనిపోయిన కిరీటయ్య పేరుతో పింఛన్ పంపిణీ అవుతున్న విషయాన్ని ఫిర్యాదు చేయటంతో విషయం వెలుగుచూసింది. చనిపోయిన కిరీటయ్య మనుమరాలు జ్యోతి మాట్లాడుతూ... కిరీటయ్యకు గ్రామంలో మంచి పేరు ఉందని, అటువంటి వ్యక్తి పేరుతో వేరే వారు దొంగతనంగా పింఛన్ పొందటం తమను కలచి వేసిందని, అందుకే అధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. వెంటనే పింఛన్‌ను రద్దు చేయడంతో పాటు ఇప్పటివరకు పంపిణీ చేసిన పింఛన్ మొత్తం సొమ్మును రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ఉన్నతాధికారులతో పాటు రాష్ట్ర స్థాయి అధికారులకు కూడా ఈ విషయంపై ఫిర్యాదు చేశామని, వెంటనే వారు స్పందిస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు. ఈ వ్యవహారంలో 2012 నుంచి అధికారులను, ఉద్యోగులను ఎలా మేనేజ్ చేయగలిగారనే అంశాలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి.