బదిలీల ప్రక్రియలో భాగంగా వెబ్ ఆప్షన్ ఇచ్చుకునేందుకు ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లకు ఇచ్చిన గడువు బుధవారంతో ముగియనున్నది. ఎస్జీటీలకు ఈనెల తొమ్మిదో తేదీ వరకు సమయం ఉంది. కాగా బదిలీలు కోరుకునే టీచర్లు వెబ్‌ఆప్షన్లు ఇవ్వడానికి కనీసం రెండు గంటలు పడుతుంది. తప్పనిసరిగా బదిలీపై వెళ్లాల్సిన టీచర్లకు అయితే రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. ఉమ్మడి జిల్లాలో సుమారు 1,800 మంది తప్పనిసరిగా ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాల నుంచి మరొకచోటకు వెళ్లిపోవాల్సి ఉంది. అందువల్ల ఉమ్మడి జిల్లాలో ఆ కేటగిరీలో వున్న మొత్తం ఖాళీలకు ఆప్షన్ ఇవ్వాల్సి ఉంది. ఆప్షన్ ఇచ్చుకునే పోస్టు ఏ కేటగిరీలో ఉంది?, మండల కేంద్రానికి ఎంత దూరంలో ఉంది?, ఒకవేళ రేషనలైజేషన్‌లో రద్దయ్యే అవకాశం ఉందా?...అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. దీనికితోడు మంగళవారం స్కూలు అసిస్టెంట్లకు పదోన్నతులు ఇచ్చినందున ఆ ఖాళీలను సాయంత్రం ఆన్‌లైన్‌లో చూపించారు. వాటిని కూడా కలుపుకుని ఆప్షన్లు ఇవ్వడం వల్ల ఆలస్యమవుతుందని అనకాపల్లి జిల్లా చోడవరానికి చెందిన టీచర్ ఒకరు తెలిపారు.