తిరుపతి హథీరాం జీ మఠానికి మహంతుగా ఉన్న అర్జున్ దాస్ అనే వ్యక్తి అనేక అక్రమాలకు పాల్పడ్డారని దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కోట్లాది రూపాయల ఆస్తుల్ని అన్యాక్రాంతం చేశారని అన్నారు. ప్రభుత్వానికి హథీరాంజీ మఠంపై ఎలాంటి హక్కులు లేకుండా అర్జున్ దాస్ కోర్టుకెళ్లారన్నారు. హథీరాం జీ మఠం ఆస్తుల్ని లీజులకు ఇస్తూ అక్రమాలకు పాల్పడుతున్నట్టు తేలిందని చెప్పారు. సన్యాసిగా ఉండాల్సిన మహంత్ అర్జున్ దాస్ వివాహం చేసుకుని పిల్లల్ని కూడా కన్నారని.. దీనిపై కమిటీని వేసి చర్యలు కూడా తీసుకున్నామన్నారు. అందుకే ధార్మిక పరిషత్ ద్వారా స్వామీ హథీరాం జీ మఠం మహంత్‌గా ఉన్న అర్జున్ దాస్‌ను సస్పెండ్ చేసి క్రమశిక్షణా చర్యలు తీసుకున్నామన్నారు. హథీరామ్ జీ మఠానికి మరొకరిని బాధ్యులుగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి పేర్కొన్నారు.