దాచేపల్లి మండలం తంగెడ గ్రామ పరిధిలో గురువారం ఒకే వ్యక్తి పేరుతో 500 ఎకరాలు నమోదు కావడం చర్చనీయాంశమైంది. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం, గ్రామ సచివాలయ సిబ్బంది అలసత్వమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. మీ భూమి పోర్టల్లో నమోదైన ప్రకారం. ఖాతాదారుని పేరు 'ఇతరులు' అని, తండ్రి షేక్ తండా సైదా సాహెబ్ పేర్కొంటూ ఖాతా నెంబరు 9999లో 500 ఎకరాలు నమోదైంది. సర్వే, సబ్ డివిజన్ నంబర్లు 10 నుంచి 997-1 వరకు ఉన్నాయి. భూమి వివరణలో మెట్ట, పుంజ అని నమోదు చేశారు. సాధారణంగా గ్రామ పరిధిలో మిగులు భూములకు ఒక ఖాతా నెంబరు ఇచ్చి ఆన్లైన్లో ఖాతాదారుని పేరు కిందఇతరులు' అని నమోదు చేస్తారు.
తంగెడ గ్రామ పరిధిలోనూ ఖాతా నెంబరు 9999గా నమోదు చేసి, దానిలో మిగిలిన భూముల సర్వే నంబర్లు నమోదు చేశారు. అయితే ఈ ఖాతా నంబరుకు సైదా సాహెబ్కు సంబంధించి ఆధార్ను లింక్ చేయడంతో అన్ని సర్వే నంబర్ల భూములకు ఆయన పేరు ఆటోమేటిక్ గా నమోదైంది. ఇదంతా తంగెడ సచివాలయంలో జరిగింది. వీఆర్వో లాగిన్ నుంచి తహసీల్దార్ లాగిన్ కు రావాల్సి ఉంది. కొద్ది రోజులుగా సైదా సాహెబ్ పేరిట పొలం నమోదు కావడంతో రైతులు ఆందోళన చెంది తహసీల్దార్కు తెలిపారు. దీనిపై తహసీల్దారు ప్రవీణ్ కుమార్. మాట్లాడుతూ సాంకేతిక లోపంతో ఇలా జరిగిందని, ఈ విషయాన్ని ఆర్డీవోకు తెలియచేసి సరిచేయడానికి గురజాలకు వచ్చామన్నారు. గతంలో మాచర్ల, కారంపూడి, దుర్గిలోనూ ఇలాగే జరిగిందన్నారు. ఇతరులు పొలం సైదా సాహెబ్ పేరున రాయడం లేదా నమోదు చేయలేదన్నారు. తంగెడ రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.