ఏపీకి చల్లటి కబురు అందింది. నైరుతి రుతుపవనాలు కేరళ భూభాగాన్ని తాకాయి. అక్కడి నుంచి నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఇప్పటికే కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. దేశంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ తెలిపింది. రాబోయే 24 గంటల్లో ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలకు, బంగాళాఖాతంలోకి విస్తరించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరో 48 గంటల్లో పశ్చిమబెంగాల్, సిక్కింలోని కొన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయి. మరోవైపు మరో మూడు, నాలుగు రోజుల్లో అనంతపురం మీదుగా రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాలను తాకనున్నాయని అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. ఈ ప్రభావంతో పశ్చిమబెంగాల్, ఒడిశా ప్రాంతాల్లో ఓ మోస్తరుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటున్నారు. మరో 24 గంటల వరకు ఏపీ, తెలంగాణ, ఒడిశాలో వడగాలుల ప్రభావం ఉంటుందని.. అలాగే ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల రానున్న రెండు రోజుల పాటు ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది అంటున్నారు. అలాగే అక్కడక్కడ వడగాలులు వీస్తాయని.. వేడి, తేమతో కూడిన వాతావరణం ఉంటుందంటున్నారు. అక్కడక్కడా ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.
మరోవైపు ఏపీలో ఎండలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని పల్నాడు జిల్లా జంఘమహేశ్వరపురంలో 44.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మరికొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత దాటింది. రాయలసీమ, కోస్తాల్లో అక్కడక్కడా వానలు కూడా పడ్డాయి. అలాగే రాష్ట్రంలో ఈ నెల 14 వరకు ఎండలు, వడగాడ్పులు కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు. నైరుతి రుతు పవనాలు రాష్ట్రంలో ప్రవేశించిన తర్వాత వాతావరణం చల్లబడుతుందంటున్నారు. రానున్న రోజుల్లో వర్షాలు పడతాయంటున్నారు.
తడిసిన ధాన్యం కొనలేం.. రైతులకు షాకిచ్చిన మిల్లర్లు
తెలంగాణ కూడా నిప్పుల కొలిమిని తలపిస్తోంది. అధిక ఉష్ణోగ్రతలతో జనాలు అల్లాడిపోతున్నారు.. వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాష్ట్రంలోని పది మండలాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45-46.5 డిగ్రీల మధ్య నమోదయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొన్నిచోట్ల ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 6.5 డిగ్రీలపైన నమోదయ్యాయి.
రాబోయే రెండు రోజులు కూడా రాష్ట్రంలో కొన్ని చోట్ల వడగాలులు వీచే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు.