కోనసీమ జిల్లా అమలాపురం మున్సిపల్ చైర్‌పర్సన్ చాంబర్‌లో వైసీపీ నేతలు పరస్పరం కర్రలతో కొట్టుకునేందుకు సిద్ధపడ్డారు. దీంతో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. వైసీపీకి చెందిన మున్సిపల్ చైర్‌పర్సన్ రెడ్డి సత్యనాగేంద్రమణి చాంబర్ తాళాలు తీయకుండా కౌన్సిలర్లను బయట వేచి ఉంచారనే కారణంతో ఈ వివాదం చోటుచేసుకుంది. మున్సిపల్ కార్యాలయం వద్ద మంత్రి పినిపే విశ్వరూప్ ఆధ్వర్యంలో శుక్రవారం వలంటీర్లకు వందనం కార్యక్రమం నిర్వహించారు. దీనికి కౌన్సిలర్లు హాజరయ్యారు. సమావేశం అనంతరం చాంబర్‌లోకి వెళ్లిన చైర్‌పర్సన్ నాగేంద్రమణి మిగిలిన కౌన్సిలర్లను ఆహ్వానించారు. తాము ముందుగా వచ్చినప్పటికీ చాంబర్ తాళాలు ఎందుకు తీయలేదంటూ 25వ వార్డు కౌన్సిలర్ నాగసుధారాణి, ఆమె భర్త చిన్నా చైర్‌పర్సన్ నాగేంద్రమణిపై విరుచుకుపడడంతో పాటు ఆమెను కొట్టినంత పనిచేశారు. దీంతో చైర్‌పర్సన్ భర్త సత్యనారాయణ, కుమారుడు ప్రదీప్.. సుధారాణి, ఆమె భర్త చిన్నా వైఖరిపై ఎదురు దాడికి దిగారు. ఈ నేపథ్యంలో చాంబర్‌లోనే చైర్‌పర్సన్ కుమారుడు, కౌన్సిలర్ భర్త తన్నుకున్నారు. దీంతో మిగిలిన సభ్యులు జోక్యం చేసుకుని చాంబర్ నుంచి వారిని బయటకు పంపించారు. బయటకు వచ్చాక కూడా ఇద్దరూ ఘర్షణకు దిగడంతో వైసీపీ నేతలు జోక్యం చేసుకుని శాంతింపజేశారు. ప్రదీప్ చేసిన దాడిలో గాయాలయ్యాయంటూ కౌన్సిలర్ భర్త చిన్నా ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ఈ ఘటనపై అటు చైర్‌పర్సన్, ఇటు కౌన్సిలర్లు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.