ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన పై విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ స్పందించారు. ప్రధాని మోదీ అమెరికా పర్యటన ఓ అత్యున్నత స్థాయి గౌరవమని ఎస్. జైశంకర్ అన్నారు. అమెరికా చట్టసభలను(కాంగ్రెస్) ఉద్దేశించి ప్రధాని మోదీ రెండోసారి ప్రసంగిస్తారని, ఇలా చేసిన తొలి భారత్ ప్రధాని మోదీయేనని తెలిపారు. ప్రధాని మోదీ 2016లో తొలిసారిగా అమెరికా పార్లమెంటులో ప్రసంగించారు.
‘‘మరే భారత ప్రధానీ ఇలా చేయలేదు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే విన్‌స్టన్ చర్చిల్, నెల్సన్ మండేలా..లాంటి బహు కొద్ది మంది మాత్రమే అమెరికా కాంగ్రెస్‌ను ఉద్దేశించి రెండుమార్లు ప్రసంగించారు. కాబట్టి, ప్రధాని పర్యటన అత్యధిక ప్రాధాన్యం సంతరించుకుంది’’ అని మంత్రి జైశంకర్ వ్యాఖ్యానించారు.
అమెరికా అధ్యక్షడు బైడెన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ అగ్రరాజ్యంలో జూన్ 21 నుంచి 24 వరకు పర్యటించనున్న విషయం తెలిసిందే. ఇది ప్రధాని తొలి అధికారిక అమెరికా పర్యటన. ఈ సందర్భంగా బైడెన్ ప్రధాని కోసం అధికారిక విందు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా, ప్రధాని అమెరికా ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.