గతానికి భిన్నంగా జూన్ నెల మూడో వారంలోకి అడుగుపెడుతున్నా ఎండల తీవ్రత ఇంకా తగ్గడంలేదు. ప్రధానంగా ఉత్తర భారతంలో రోజువారీ ఉష్ణోగ్రత 40 డిగ్రీల కిందికి దిగి రావడంలేదు. కొన్నిచోట్ల 43 డిగ్రీల టెంపరేచర్ నమోదవుతోంది. ఉత్తరప్రదేశ్, బీహార్ లలో ఎండల తీవ్రతకు చాలామంది అనారోగ్యాల పాలవుతున్నారు. గడిచిన మూడు రోజులలోనే యూపీ, బీహార్ లో వంద మంది చనిపోయారని అధికారులు వెల్లడించారు. ఇందులో 60 ఏళ్లు పైబడిన వారే ఎక్కువని చెప్పారు.
ఎండ తీవ్రత, వడగాలులకు డీహైడ్రేషన్, జ్వరం, డయేరియా తదితర అనారోగ్య సమస్యలతో ఆసుపత్రులకు జనం క్యూ కడుతున్నారు. ఎండల తీవ్రత కారణంగా బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని బాలియా చీఫ్ మెడికల్ ఆఫీసర్ జయంత్ కుమార్ మీడియాకు వెల్లడించారు. సాధారణ అనారోగ్యాలతో పాటు గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోందని అన్నారు. బయట ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల శరీరంలో టెంపరేచర్ ను బ్యాలెన్స్ చేయడానికి వివిధ అవయవాలపై ఒత్తిడి పెరుగుతుందని, ఫలితంగా వాటి పనితీరు దెబ్బతినే ప్రమాదం ఉందని చెప్పారు.
గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు తదితర అవయవాలపై ఒత్తిడి పెరుగుతుందని, ఇది హర్ట్ ఎటాక్ సహా ఆర్గాన్ ఫెయిల్యూర్ కు దారితీయొచ్చని హెచ్చరించారు. కాగా, ఎండలు తగ్గకపోవడంతో పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వేసవి సెలవులు పెంచుతున్నట్లు బీహార్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 24 వరకు సెలవులు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.