వర్షాల కోసం ఎదురుచూస్తున్న ఏపీ ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాల విస్తరణ ఈ ఏడాది అంచనాకు భిన్నంగా ఉంది. రుతుపవనాలు విస్తరించిన ప్రాంతాల్లో కొన్నిచోట్ల వర్షాలు లేకపోవడం.. మరికొన్నిచోట్ల ఒక మోస్తరుగా, మరికొన్నిచోట్ల కుంభవృష్టిగా కురుస్తోంది. బిపోర్‌జాయ్ తీవ్ర తుఫాన్ తీరం దాటడంతో రుతుపవనాలు మెల్లిగా బలపడి సోమవారం నాటికి కర్ణాటకలో కొన్ని ప్రాంతాలు, ఏపీలో మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. బంగాళాఖాతంలో చాలా ప్రాంతాలకు విస్తరించాయి.
రాయలసీమలో కొన్ని భాగాలు, నెల్లూరు జిల్లా కావలి వరకు విస్తరించగా.. ఆదివారం అర్ధరాత్రి తరువాత కోస్తా, సీమలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో రుతుపవనాలు మధ్య కోస్తా వరకు విస్తరిస్తాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కావలితో ఆగిపోగా.. బంగాళాఖాతంలో రుతుపవనాలు చురుగ్గా ఉండడంతోపాటు ఉత్తరాది గుండా వరుసగా వెస్ట్రన్ డిస్ట్రబెన్సులు పయనించాయి. ఈ నెల 22 నాటికి ఏపీ, తెలంగాణల్లో దాదాపు అన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
నైరుతి రుతుపవనాలు మంగళవారానికి కోస్తాంధ్రలోని పలు ప్రాంతాలు, తెలంగాణకు విస్తరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో రాష్ట్రమంతటికీ విస్తరించి వర్షాలు కురిసే పరిస్థితి ఉందని.. ఉపరితల ఆవర్తనం ఇలాగే కొనసాగితే ఇంకా ముందుగానే రాష్ట్రమంతా విస్తరిస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. నైరుతి రుతుపవనాలు కావలి వరకు విస్తరించడంతో.. ఆదివారం అర్ధరాత్రి తరువాత కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల వానలు పడ్డాయి. సోమవారం సాయంత్రం కూడా కొన్నిచోట్ల వర్షాలు పడగా.. చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.
రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అంచనా వేస్తోంది. అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కాకినాడ, అన్నమయ్య, చిత్తూరు, శ్రీ సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షం కురుస్తుందని అమరావతి ఐఎండీ తెలిపింది. ఈనెల 22 నుంచి వర్షాలు పెరుగుతాయని.. రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తుండటంతో,.. కొద్దిరోజులుగా ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు ఉపశమనం పొందుతున్నారు. సోమవారం రాష్ట్రంలోని 11 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 88 మండలాల్లో వడగాల్పులు వీచాయి. మరో రెండు రోజులు ఎండ తీవ్రత, వడగాల్పులు కొనసాగనున్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ అంటోంది.
నేడు 32 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 106 మండలాల్లో వడగాల్పులు, ఎల్లుండి 17 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 217 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణసంస్థ తెలిపింది. ఇవాళ శ్రీకాకుళం,మన్యం,అల్లూరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది అంటున్నారు. రాయలసీమలో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని.. సోమవారం (19-06-2023) నైరుతి రుతుపవనాలు రాయలసీమ మరియు దక్షిణాంధ్రలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయని తెలిపింది.