ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ మూడు పార్టీలు పొత్తుపెట్టుకొంటే... నరసాపురం టిక్కెట్టు అడుగుతా,,,ఎంపీ రఘురామకృష్ణ రాజు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 21, 2023, 07:39 PM

రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో దొంగ ఓట్ల నమోదు, ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరుల ఓట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోందన్నారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు. రాష్ట్రంలో దొంగ ఓట్ల నమోదు ప్రక్రియ నిజమేనని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా కూడా అంగీకరించారన్నారు. దొంగ ఓట్ల నమోదు, ఓట్ల జంబ్లింగ్ విధానంపై మచిలీపట్నానికి చెందిన దిలీప్ కుమార్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారన్నారు. ఓట్ల జంబ్లింగ్ వల్ల సాధారణ ఓటరు తన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోలేరని ఆయన తన ప్రజావాజ్యంలో పేర్కొన్నారన్నారు. ఓటరు తన పోలింగ్ బూత్‌కు వెళ్లడానికి బద్దకిస్తారని.. ఆలోగానే దొంగ ఓటు వేసేస్తారన్నారు. విశాఖపట్నంలో ఈసారి ఎలాగైనా రామకృష్ణ బాబును ఓడించాలనే ఉద్దేశంతో 40 వేల దొంగ ఓట్లను నమోదు చేశారన్నారు.


ఈ దొంగ ఓట్ల అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్‌కు వివరిస్తూ తాను ఒక లేఖ రాశాను అన్నారు. దొంగ ఓట్ల నమోదు ప్రక్రియకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని.. వారిని కఠినంగా శిక్షించాలన్నారు. ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్లకు సంబంధమే లేదని.. ఓటర్ నమోదు ప్రక్రియలో భాగంగా రోజు వారి వేతనంతో కొంత మంది సిబ్బందిని ఎన్నికల సంఘం అధికారులు నియమించుకుంటారన్నారు. దొంగ ఓట్ల నమోదు, ప్రతిపక్ష పార్టీ సానుభూతిపరుల ఓట్లను తొలగించడం ద్వారా వాలంటీర్లు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని అన్నారు. ఈ విషయంలో ప్రతిపక్ష పార్టీలు అప్రమత్తంగా ఉండాలని, విదేశాలలో నివసించే వారి పేరిట కూడా దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారన్నారు. తమ ఓట్లను తాము కాపాడుకుంటూ, ప్రజాస్వామ్య పరిరక్షణకు తెలుగుదేశం, జనసేన పార్టీలు కృషి చేయాలన్నారు.


పరీక్షల్లో కష్టపడి ర్యాంకులు సాధించుకున్న విద్యార్థులు జగనన్న ఆణిముత్యాలనడం విడ్డూరమన్నారు. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనతో పాటు పలు పథకాలకు ముఖ్యమంత్రి గారు తన పేరు పెట్టుకున్నారంటే సరే.. కానీ కష్టపడి చదివిన విద్యార్థుల శ్రమను తన కీర్తి ప్రతిష్టలు పెంపొందించు కోవడం కోసం వినియోగించుకోవాలని చూడడం విస్మయాన్ని కలిగిస్తోంది అన్నారు. ఆణిముత్యాలు పథకానికి నాలుగు కోట్ల రూపాయల నిధులను కేటాయించారని, ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతిని అందజేయాలని నిర్ణయించారన్నారు. ఇంత వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ.. ఈ పథకం ప్రచారం కోసం కోట్ల రూపాయలు వెచ్చించడం విడ్డూరంగా ఉందన్నారు. సీఎం జగన్ నిర్వహించే ప్రభుత్వ సభకు ఐదు నుంచి 6 కోట్ల రూపాయలు ఖర్చు అవుతోందన్నారు. ప్రభుత్వ సభలలో ఎన్నికల ప్రచారం నిర్వహించుకుంటూనే, ప్రతిపక్ష పార్టీ నేతలపై, మీడియా సంస్థలపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.


రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీల మధ్య నూటికి నూరుపాళ్లు పొత్తు ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇప్పటికే తెలుగుదేశం, జనసేన శ్రేణులు క్షేత్రస్థాయిలో కలిసిపోయాయని.. గత రెండేళ్లుగా రెండు పార్టీల కార్యకర్తల మధ్య మంచి సమన్వయం కనిపిస్తోందన్నారు. ఉభయగోదావరి జిల్లాలోని 34 స్థానాలలో ఒక్క స్థానం కూడా అధికార పార్టీకి రావద్దన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాటల్లో ఎటువంటి దోషం లేదన్నారు. అలాగే 175 కు 175 స్థానాలు తమకే రావాలన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యల్లోనూ తప్పులేదన్నారు. ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే నరసాపురం స్థానం ఏ పార్టీ తీసుకుంటే, ఆ పార్టీ తరఫున తాను పోటీ చేస్తానని అన్నారు.


కూటమిలోని అన్ని పార్టీల జెండాలను ప్రచారంలో భాగంగా పట్టుకొని ఇంటింటికి ప్రచారాన్ని నిర్వహిస్తానని రఘురామకృష్ణ రాజు తెలిపారు. ముఖ్యమంత్రిగా అవకాశం వస్తే కాదననని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందని.. మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స సత్యనారాయణలకు ముఖ్యమంత్రిగా అవకాశం వస్తే వద్దంటారా? అని ప్రశ్నించారు. ప్రజల ఆకాంక్షల మేరకు తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య పొత్తు ఖచ్చితంగా ఉంటుందని ఆయన కుండబద్దలు కొట్టారు. పవన్ కళ్యాణ్ తమ పార్టీ కాపు నేతలు, మంత్రులు, మాజీ మంత్రులు పరుష పదజాలంతో దూషించినప్పుడు ముద్రగడ పద్మనాభం లేఖ రాసి ఉంటే బాగుండేదన్నారు. అలాగే తనను లాకప్‌లో చిత్రహింసలకు గురి చేసినప్పుడు పద్మనాభం లేఖ రాసి ఉంటే మరింత బాగుండేదన్నారు. పవన్ కళ్యాణ్‌ని కాపు నేతల చేత తిట్టించినప్పుడు లేఖ రాయని ముద్రగడ పద్మనాభం.. ఇప్పుడు లేఖ రాయడం ఎంత వరకు సమంజసం అన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa