ఈస్ట్-వెస్ట్ మెట్రో (గ్రీన్ లైన్) ప్రాజెక్ట్ పనులను హౌరా మైదాన్ నుండి ఎస్ప్లానేడ్ వరకు కేంద్ర రైల్వే, కమ్యూనికేషన్స్ మరియు ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం పరిశీలించారు. మంత్రి వైష్ణవ్ స్టేషన్‌ను పరిశీలించి ఇక్కడ ఏర్పాటు చేయనున్న అత్యాధునిక ప్రయాణికుల సౌకర్యాలపై ఆరా తీశారు. హౌరా మైదాన్ మెట్రో స్టేషన్‌లో మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ నగరంలోని అన్ని మెట్రో ప్రాజెక్టులకు సరిపడా నిధులు కేటాయించామని, అన్ని మెట్రో ప్రాజెక్టుల పురోగతిని కేంద్ర ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని స్పష్టం చేశారు. హౌరా మైదాన్ స్టేషన్‌ను పరిశీలించిన అనంతరం మంత్రి హూగ్లీ నది కింద ఉన్న మెట్రో సొరంగం ద్వారా ట్రాలీ తనిఖీని చేపట్టి భారతదేశంలోనే అత్యంత లోతైన మెట్రో స్టేషన్‌గా అవతరిస్తున్న హౌరా స్టేషన్‌కు చేరుకున్నారు.