దివ్యాంగులకు సంక్షేమం అందించడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోని అగ్రగామిగా నిలిచిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల ఇన్‌చార్జ్, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. వైయస్ఆర్ సీపీ దివ్యాంగుల విభాగ సమావేశాన్ని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి టెలి కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వేలాదిమంది దివ్యాంగులకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు పెన్షన్ అందిస్తూ వారికి అండగా నిలుస్తోందన్నారు. 14 రకాల రోగ పీడితులు, వైకల్యాలున్న 7,98,352 మందికి నెలకు రూ.255 కోట్లు పైగా పింఛన్లు అందిస్తుందన్నారు. దివ్యాంగులకు రాష్ట్రంలో నాలుగు శాతం రిజర్వేషన్లు కూడా అమలు చేస్తుందని చెప్పారు.