కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సవాళ్లను ఎదురెళ్లడం చాలా ఇష్టం. తాజాగా, వాస్తు దోషం పేరుతో చాలా సంవత్సరాల నుంచి మూసేసిన విధాన సభలోని తన చాంబర్ పశ్చిమ ద్వారాన్ని తెరిపించి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పశ్చిమ ద్వారాన్ని మూసివేయడానికి కారణం ఏంటని అధికారులను సీఎం ప్రశ్నించారు. దీనికి వాస్తు దోషం కారణమని, అందుకే చాలా ఏళ్ల కిందటే ఆ తలుపులు మూసేసినట్టు వారు సమాధానం ఇచ్చారు. దీంతో దానిని వెంటనే తెరవాలని సిద్ధూ ఆదేశించారు.
తలుపులు తెరిచిన తర్వాత ఆ ద్వారం గుండానే సీఎం తన చాంబర్‌లోకి ప్రవేశించడం గమనార్హం. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కర్ణాటక ముఖ్యమంత్రిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మూఢనమ్మకాలను సీఎం పాతిపెట్టేశారని కొందరు అంటే.. సిద్ధూ సమస్యల్లో చిక్కుకోవడం ఖాయమని మరికొందరు చెబుతున్నారు. ఇక,
కర్ణాటక విధానసౌధ మూడో అంతస్తులోని సీఎం ఛాంబర్‌కు పశ్చిమ దిక్కులో ఉన్న తలుపులను 1998లో అప్పటి ముఖ్యమంత్రి జేహెచ్ పటేల్ మూసివేయించారు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఆయన సారధ్యంలోని జనతా దళ్ పార్టీ ఓడిపోవడంతో.. పరాజయానికి కారణం ఈ ద్వారమేనని భావించి తాళాలు వేయించారు. అయితే, 2013లో సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయ్యాక మళ్లీ ఆ తలుపులు తెరిపించారు. అప్పుడు తప్ప, అంతకు ముందు 15 ఏళ్లలో ఆరుగురు ముఖ్యమంత్రులుగా పనిచేసినా ఎవరూ ఆ తలుపులు తెరిపించే సాహసం చేయలేదు. బీజేపీ ముఖ్యమంత్రులు బీఎస్ యడియూరప్ప, బసవరాజు బొమ్మై, జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి ఎవరూ కూడా ఆ గుమ్మం ద్వారా వెళ్లడానికి నిరాకరించారు. కానీ, సిద్ధరామయ్య మాత్రం ఆ తలుపులు రెండోసారి తెరిపించి తన చాంబర్‌లోకి ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.
విధాన సౌధ మూడో అంతస్తులో సీఎం ఛాంబర్ ఉండగా.. దానికి దక్షిణంలో ఓ ద్వారం ఉంటుంది. ఆ ద్వారం వాస్తు దోషంతో ఉందని అసెంబ్లీ సభ్యులందరూ భావిస్తుంటారు. అందుకే చాలా ఏళ్లుగా అది మూతపడి ఉంది. గతంలో బీఎస్ యడియూరప్ప ఇటువంటి వాటిని బలంగా నమ్మేవారు. ఆయన నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టడానికి ముందు ఓ జ్యోతిషుడి సలహాతో తన పేరులో అక్షరాలను మార్పించుకున్న విషయం తెలిసిందే.