దేశంలో తాజాగా భిన్నమైన వాతావరణ పరిస్థితులు కొనసాగుతూ వచ్చిన విషయం తెలిసిందే. ఇదిలావుంటే కాస్త ఆలస్యమైనా నైరుతి రుతుపవనాలు దేశమంతటా క్రమంగా విస్తరిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, ఆర్ధిక రాజధాని ముంబయిలో శనివారం రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. ఈ రెండు నగరాలను రుతుపవనాలు ఏకకాలంలో తాకడం అరుదుగా జరుగుతుంది. షెడ్యూల్ కంటే రెండు రోజుల ముందు ఢిల్లీని.. రెండు వారాల ఆలస్యంగా ముంబయిను నైరుతి రుతుపవనాలు తాక్కినట్టు భారత వాతావరణ విభాగం ఆదివారం వెల్లడించింది. ఆరు దశాబ్దాల కిందట ఇలా జరిగిందని, చివరి సారిగా 1961 జూన్ 21న ఢిల్లీ, ముంబయి నగరాల్లోకి ఒకే రోజున రుతుపవనాలు ప్రవేశించినట్టు పేర్కొంది.
‘నైరుతి రుతుపవనాలు చురుకుగా ఉన్నాయి.. ముంబయి సహా మహారాష్ట్ర మొత్తం విస్తరించాయి.. మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీతో పాటు హరియాణా, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూలోని కొన్ని ప్రాంతాల్లోనూ విస్తరించాయి.. వచ్చే రెండు రోజుల్లో మరింత ముందుకు కదలి మిగతా ప్రాంతాలకు చేరుకుంటాయి’ అని ఐఎండీ డైరెక్టర్ డాక్టర్ మృత్యుంజయ మహాపాత్ర అన్నారు. ఢిల్లీ, పరిసర ప్రాంతాలలో ఎండ వేడిమి నుంచి వర్షం ఉపశమనం కలిగించినప్పటికీ, గురుగ్రామ్‌లోని వివిధ ప్రాంతాలలో వర్షం నీరు నిలిచిపోయింది.
గత 24 గంటల్లో ముంబయి, చుట్టపక్కల ఏకధాటిగా కురిసిన వర్షాలకు పలు ప్రాంతాల్లో వర్షపు నీటిలో చిక్కుకున్నాయి. రహదారులపైకి నీరు చేరడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సోమవారం ఉదయం వరకూ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. శనివారం సాయంత్రం కురిసిన వర్షానికి అంధేరీ, మలద్, దాషిర్‌లు ముంపు బారినపడ్డాయి. వీటికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహారాష్ట్రలోని రాయ్‌గఢ్, రత్నగిరి జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే, పాల్ఘర్, ముంబయి, థానే, సింధుదుర్గ్‌లకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.