సోమవారం ఉదయం 8. 30 గంటలకు మంగళగిరి - తాడేపల్లి నగర సంస్థ పరిధిలోని పాత మంగళగిరిలో నిర్మిస్తున్న సగర భగీరథ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే ఆర్కే కార్పొరేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పెద్దపీట వేస్తున్నారని, అదే స్ఫూర్తితో సగర భగీరథ కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తి చేసి వారికి అండగా నిలబడుతున్నామన్నారు.
ఇప్పటికే పట్టణంలోని మున్సిపల్ స్థలంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని, పెద్దల అభ్యర్థన మేరకు షెడ్డు నిర్మాణం కూడా చేస్తున్నామని చెప్పారు. మరో 15 రోజుల్లో నిర్మాణ పనులు పూర్తిచేసుకుని సగర కమ్యూనిటీ హాల్ ప్రారంభిస్తామని తెలిపారు. రూ. 40 లక్షల అంచనా తో ప్రారంభించిన కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులు సుమారు 1 కోటి రూపాయలకు చేరుకుందని, దాతలు ముందుకు వస్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో రెండో ఫ్లోర్ కూడా నిర్మిస్తామని స్పష్టం చేశారు.
ఇప్పటికే మంగళగిరి నగరంలో వివిధ కులాలకు కమ్యూనిటీ హాల్స్ నిర్మించామని యాదవ, క్రిస్టియన్, ఎరుకల, యానాది కులాలకు ఉన్నతాధికారుల అనుమతితో మున్సిపల్ స్థలాలు గుర్తించి టెండర్లకు వెళ్లబోతున్నట్టు తెలిపారు. త్వరలో నాయి బ్రాహ్మణ, బోయ వాల్మీకి కులాలకు కమ్యూనిటీ హాల్ నిర్మించేందుకు స్థల అన్వేషణ జరుగుతుందని అతి త్వరలో వారికి కూడా కమ్యూనిటీ హాల్స్ నిర్మిస్తామని చెప్పారు.