ఏపీలో ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలల సమయాల్లోనూ ఇవాళ్టి నుంచి మార్పులు చోటుచేసుకోనున్నాయి. నిన్న మొన్నటి వరకూ వేసవి, వడగాల్పుల ప్రభావం తీవ్రంగా ఉండటంతో విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి ప్రభుత్వం ఒంటిపూట బడులు మాత్రమే నిర్వహిస్తోంది. దీంతో విద్యార్ధులు ఉదయాన్నే పాఠశాలలకు వెళ్లి మధ్యాహ్నం లోపే తిరిగి ఇళ్లకు చేరుకునే వారు. కానీ ఇప్పుడు వర్షాలు కురుస్తుండటంతో పరిస్ధితి మారింది.
దీంతో ప్రభుత్వం కూడా ఒంటిపూట బడుల స్ధానంలో రెండు పూటలు బడులు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం ఇవాళ్టి నుంచే అమల్లోకి రానుంది. వాస్తవానికి ఈ నెల 12న పాఠశాలలు తెరుచుకున్నప్పటికీ వేసవి పరిస్దితుల దృష్ట్యా తొలి వారం ఒంటి పూట బడుల్ని కొనసాగించింది. ఆ తర్వాత రెండో వారానికి కూడా వడగాల్పులు తగ్గకపోవడంతో వాటిని తిరిగి వారం రోజుల పాటు పొడిగించింది. కానీ గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పాఠశాల సమయాల్లో మార్పులు చేయాలని నిర్ణయించారు.
ఇవాళ్టి నుంచి రాష్ట్రంలోని అన్ని స్కూళ్లను రెండు పూటలా నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ విద్యాసంస్ధలకు ఆదేశాలు పంపారు. దీని ప్రకారం ఇకపై పూర్తిస్ధాయిలో బడులు నిర్వహించే విధంగా ఉపాధ్యాయులు షెడ్యూల్ సిద్దం చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులకు విద్యాకానుక ఇచ్చేసింది. అలాగే త్వరలో అమ్మఒడి మొత్తాల్ని కూడా తల్లుల ఖాతాలోకి జమ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 28న ఈ కార్యక్రమం నిర్వహించనుంది.