జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు మాజీ ఎంపీ, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు చేగొండి హరిరామ జోగయ్య కీలక సూచన చేశారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఎక్కడి నుంచైన పోటి చేయాలని సూచించారు. ఎక్కడి నుంచి పోటీ చేసిన భారీ మెజార్టీతో గెలుస్తారని ధీమాను వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లాకు వస్తున్న వారాహి విజయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
హరిరామ జోగయ్య పవన్‌కు ఓ లేఖ రాసి వీడియోను కూడా విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర పశ్చిమగోదావరి జిల్లాలోకి ప్రవేశించిందన్నారు. నరసాపురం నియోజకవర్గంలో కార్యకర్తలు, అనేక రంగాలకు సంబంధించి ప్రముఖులను కలవడంతో పాటూ బహిరంగ సభ పాల్గొంటారని వివరించారు. పవన్‌కు నరసాపురం ప్రజలు ఘన స్వాగతం పలికాలని కోరారు. జిల్లాలో అనేక నియోజకవర్గాలు జనసేన పార్టీకి బలమైనవి అని చెప్పడానికి సందేహం లేదన్నారు.
జిల్లాలోని నర్సాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం నియోజకవర్గాలు బలమైన నియోజకవర్గాలుగా చెప్పుకొచ్చారు. రాబోయే ఎన్నికల్లో పవన్ పోటీ చేయడానికి చాలా అనువైనవని.. ఈ నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో పోటీ పెట్టినా అత్యిధికమైన మెజార్టీతో జనసేనాని గెలవడానికి అవకాశం ఉంది అన్నారు. నరసాపురం కొణిదెల కుటుంబానికి సొంత నియోజకవర్గంగా ఏనాటి నుంచో పరిగణిస్తున్నారన్నారు.
ఇక భీమవరంలో 2019లో పవన్ కళ్యాణ్ పోటీ చేశారని గుర్తు చేశారు. ఎక్కడ పోతే అక్కడే వెతుక్కోవాలని సామెతను గుర్తు చేశారు. భీమవరం ప్రజలు పవన్‌ను మరోసారి అక్కడి నుంచే పోటీ చేయాలని.. ఈసారి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించుకుంటారని చెబుతున్నారన్నారు. 2009లో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ప్రజారాజ్యం పార్టీ గెలిచిందని గుర్తు చేశారు. ఈ నియోజకవర్గంలో పవన్ పోటీచేస్తే తిరుగుండదు అన్నారు. జనసేన అధినేత రాబోయే ఎన్నికల్లో మూడు నియోజకవర్గాలలో ఏదో ఒక నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకోవడాన్ని పరిశీలించాలని కోరారు. ఈ మూడిట్లో ఏ నియోజకవర్గంలో పోటీచేసిన మెజార్టీతో గెలుస్తారని హామీ ఇస్తూ ఈ నియోజకవర్గాల ప్రజల తరఫున విన్నవిస్తున్నాను అన్నారు.
వారాహి విజయ యాత్ర ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలోకి అడుగు పెట్టింది. వారాహి విజయ యాత్రను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. అలాగే పోలీస్ అధికారులు, పోలీస్ సిబ్బంది, మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు చెప్పారు. పార్టీ నేతలు, కార్యకర్తల్ని కూడా అభినందించారు జనసేన పార్టీ అధినేత.