ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి సోమవారం హైకోర్టుకు హాజరయ్యారు. నిర్దిష్ట గడువులోగా బీఈడీ స్పాట్ అడ్మిషన్లను ర్యాటిఫికేషన్ చేయించకుంటే ఒక్కో విద్యార్థి రూ.2 వేలు పెనాల్టీ చెల్లించాలన్న నిబంధనపై కోర్టుకు వివరణ ఇచ్చారు. బీఈడీ కాలేజీల యాజమాన్యాలలో క్రమశిక్షణ తీసుకొచ్చేందుకు ఈ నిబంధన తీసుకొచ్చామన్నారు. గడువులోగా ర్యాటిఫికేషన్ చేయించకుంటే ఒక్కో విద్యార్థి తరఫున రూ.2వేలు చెల్లించాలని సంబంధిత కాలేజీలకు స్పష్టం చేశామన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. ఉన్నత విద్యామండలి ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను పరిశీలిస్తే... విద్యార్థులే సొమ్ము చెల్లించాలనే అర్ధం వస్తుందన్నారు. వాటి ఆధారంగా కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల నుంచి పెనాల్టీ సొమ్ము వసూలు చేసే ప్రమాదం ఉందన్నారు. సంబంధిత ప్రోసీడింగ్స్‌ని సవరించాలని ఉన్నత విద్యామండలికి సూచించారు. విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. ఈమేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు సోమవారం ఆదేశాలిచ్చారు.