బుధవారం జిల్లా పరిషత సర్వసభ్య సమావేశం ఒంగోలులోని పాత జడ్పీ సమావేశ మందిరిలో చైర్‌పర్సన బూచేపల్లి వెంకాయమ్మ అధ్యక్షతన జరిగింది. సమావేశం ప్రారంభం కాగానే వెంకటరమణ మాట్లాడుతూ.. జడ్పీటీసీ సభ్యురాలైన తన ప్రమేయం లేకుండా పనులు ఏ విధంగా మంజూరు చేస్తున్నారని ప్రశ్నించారు. గతంలో కూడా తనకు తెలియకుండా రూ.10 లక్షల పనులు ఇచ్చారని, ఇప్పుడు మరో రూ.15 లక్షల పనులు మంజూరు చేశారని ఇదేం పద్ధతని నిలదీశారు. మీ ఇష్టానుసారంగా పనులు ఇచ్చుకుంటే తనకు ఈ పదవి ఎందుకని ప్రశ్నించారు. కనీసం జడ్పీటీసీ అన్న గౌరవం కూడా లేనప్పుడు పదవికి రాజీనామా చేస్తానంటూ తెలియజేసారు. ఇప్పటికే అనేకసార్లు తనకు జరిగిన అన్యాయం, అవమానాలను సమావేశం దృష్టికి తెచ్చానని చెప్పారు. దీనిపై జడ్పీ సీఈవో జాలిరెడ్డి జోక్యం చేసుకుని ఇటీవల జడ్పీ చైర్‌పర్సన జడ్పీటీసీలతో టెలికాన్ఫరెన్స నిర్వహించారని.. వారి సమస్యలు తెలుసుకుని, పనులకు సంబంధించి ప్రతిపాదనలు ఇస్తే మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని అన్నారు.