రాష్ట్రంలో ఎస్సీలకు వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేసిందని, ఇప్పటికైనా అసెంబ్లీలో వర్గీకరణ తీర్మానం చేసి కేంద్ర ప్రభు త్వానికి పంపించాలని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు డా.మున్నంగి నాగరాజు కోరారు. బుధవారం కర్నూలు జిల్లా, కోసిగిలోని ఎస్సీ కమ్యూనిటీ హాలులో ఎస్సీలతో సమావేశంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.... రాష్ట్రంలో దాదాపు 8 శాతం పైగా ఉన్న మాదిగలను రాజకీయ పార్టీలు కేవలం ఓటు బ్యాంకుగానే పరిగణిస్తున్నాయని, ఎస్సీ వర్గీకరణకు సహకరించని పార్టీల జెండాలు మోయవద్దని అన్నారు. ఎస్సీ వర్గీకరణ లక్ష్య సాధనకు జూలై 3వ వారంలో 20 లక్షల మందితో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కర్నూలు జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఎస్సీలు కార్యక్రమానికి తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు సుభాష్ చంద్రబోస్, దుర్గప్ప, రెడ్డిపోగు భాస్కర్, సామ్యేల్, నరసింహులు, రాజాబాబు, ఆనంద్, వీరేష్, ఉరుకుందు, నరసింహులు, వెంకటేశ్ పాల్గొన్నారు.