తొలి ఏకాదశి సందర్భంగా విజయవాడ నగరంలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. గురువారం ఉదయం 5 గంటల నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. తొలిఏకాదశి పండుగను పురస్కరించుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. స్వామి వారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో, ఆషాఢ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. పూర్వకాలంలో ఈ రోజును సంవత్సరారంభంగా పరిగణించేవారు. ఉత్తరాయణం కన్నా దక్షిణాయనంలో పండుగలూ పబ్బాలూ ఎక్కువ వస్తుంటాయి. ఉపవాస దీక్షకు నాంది ఈ తొలి ఏకాదశి. విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలిఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు.