సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ కు కర్ణాటక హైకోర్టు షాక్ ఇచ్చింది. కేంద్రం జారీ చేసిన ఆదేశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ట్విట్టర్ సంస్థ దాఖలు చేసిన పిటీషన్‌ను కర్ణాటక హైకోర్టు తిరస్కరించింది. 2021 ఫిబ్రవరి నుంచి 2022 మధ్య పదిసార్లు ట్విట్టర్‌ను బ్లాక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిందని తన పిటిషన్‌లో ఆ సంస్థ పేర్కొంది. అంతేకాదు, మరో 39 యూఆర్ఎల్స్‌ను కూడా తొలగించాలని కేంద్ర ఐటీ సమాచార శాఖ ఆదేశించిందని ఆరోపించింది. అయితే, కేంద్రం ఉత్తర్వులను సవాల్ చేస్తూ గతేడాది జులైలో ట్విట్టర్ దాఖలు చేసిన పిటీషన్‌ను జస్టిస్ కృష్ణ దీక్షిత్ తాజాగా కొట్టివేశారు.
అంతేకాదు, సోషల్ మీడియా దిగ్గజానికి రూ.50 లక్షల జరిమానా కూడా విధించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఎటువంటి వివరణను ట్విట్టర్ సంస్థ ఇవ్వలేదని న్యాయమూర్తి దీక్షిత్ వ్యాఖ్యానించారు. ‘ట్విట్టర్ సంస్థ ఓ రైతు లేదా ఓ సాధారణ వ్యక్తి కాదు.. దానికి చట్టం తెలియదన్న విషయం కాదు... అదో బిలియనీర్ కంపెనీ’ అని కోర్టు అభిప్రాయపడింది. 45 రోజుల్లోగా కర్ణాటక లీగల్ సెల్ సర్వీసెస్‌కు రూ.50 లక్షలు చెల్లించాలని ట్విట్టర్‌ను కోర్టు ఆదేశించింది. జస్టిస్ దీక్షిత్ తన తీర్పులో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను సమర్ధించారు. ట్వీట్లను, అకౌంట్లను బ్లాక్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు
కొన్ని ట్విట్టర్ ఖాతాలను బ్లాక్ చేయాలని గతేడాది జారీ చేసిన ఉత్తర్వుల్లో కారణాలను ఎందుకు వివరించలేదని ఏప్రిల్‌లో కేంద్ర ప్రభుత్వాన్ని కర్ణాటక హైకోర్టు ప్రశ్నించింది. దీనికి స్పందించిన కేంద్రం.. ప్రపంచం పారదర్శకత వైపు పయనిస్తోందని, ఐటీ చట్టంలోని సెక్షన్ 69A ప్రకారం జారీచేసినట్టు వివరణ ఇచ్చింది. దీంతో కారణాలను నమోదు చేయాల్సిన అవసరం ఉందని కోర్టు గమనించింది. ఇదిలావుంటే రైతుల నిరసనలకు సంబంధించిన అకౌంట్లను బ్లాక్ చేయాలని భారత ప్రభుత్వం ట్విటర్‌పై ఒత్తిడి తెచ్చిందని ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈఓ జాక్ డోర్సీ ఆరోపణలు చేసిన రెండు వారాల్లోనే హైకోర్టు ఈ తీర్పు వెలువరించడం గమనార్హం. తాజాగా కర్ణాటక హైకోర్టు తీర్పుపై కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ట్విట్టర్‌లో స్పందించారు. ‘ట్విట్టర్‌కు నోటీసులు అందజేశామని, దానిని పాటించడం లేదు..కాబట్టి మీరు సమ్మతి ఎందుకు ఆలస్యం చేశారనే కారణం చెప్పలేదు.. ఒక ఏడాది కంటే ఎక్కువ జాప్యం జరిగింది ... అప్పుడు మీరు అకస్మాత్తుగా కోర్టును ఆశ్రయించారు.. మీరు రైతు కాదు బిలియన్ డాలర్లు కంపెనీ’అని మంత్రి ట్వీట్ చేశారు.