నంద్యాల జిల్లా కేంద్రంలోని ఎస్ పి వై ఆగ్రో ఇండిస్ట్రీస్ లిమిటెడ్ సహకారంతో నంది పైప్స్ బ్యాడ్మింటన్ అకాడమీలో ఉమ్మడి కర్నూలు జిల్లా బ్యాడ్మింటన్ పోటీలను నంది గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత్రి సుజల, రామకృష్ణ విద్యా సంస్థల డైరెక్టర్ హేమంత్ కుమార్ రెడ్డి, ఏపి బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కె. వంశీధర్ ప్రారంభించారు. శనివారం సుజల మాట్లాడుతూ.. ఇటువంటి పోటీలు ఇక్కడ జరపడం క్రీడాకారులకు మంచి అవకాశమని అలాగే తమ తండ్రి దివంగత ఎస్ పి వై రెడ్డి ఆశయాలకు అనుగుణంగా క్రీడాకారులకు తమవంతు సహాయ సహకారాలు ఎల్లపుడు వుంటాయని ఆమె అన్నారు. క్రీడల వలన పిల్లలకు మానసిక ఉల్లాసం, చక్కటి ఆరోగ్యం అలాగే మంచి నడవడిక పోటీతత్వం అలవాడుతాయని, క్రీడాకారులకు గెలుపు ఓటములు సహజమని, గెలుపు వల్ల పొంగి పోకుండా, ఓటమి వలన కృంగి పోకుండా పోటీలలో ముందుకు సాగాలని తెలిపారు. హేమంత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ పోటీలు నంద్యాలలో జరగడం గర్వించదగ్గ విషయం అన్నారు. క్రీడాకారులకు ఈ పోటీలు పునాదులవంటివని కష్టపడి ఆడి మన జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతలు తేవాలని తెలిపారు. వంశీధర్ మాట్లాడుతూ. ఈ పోటీలలో గెలిచిన క్రీడాకారులు ఉమ్మడి కర్నూలు జిల్లా నుండి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎన్నిక కాబడుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షులు, శేషిరెడ్డి, సంజీవ రెడ్డి, నంది సంస్థల సిబ్బంది రామిరెడ్డి, మహేశ్వరరెడ్డి, రామయ్య, కోచ్ నాగార్జు క్రీడాభిమానులు పాల్గొన్నారు.